నూజివీడు ఎమ్మెల్యేపై చర్య తప్పదా?

విజయవాడ, జూలై 19 : నూజివీడు టిడిపి ఎమ్మెల్యే రామకోటయ్యపై పార్టీ అధిష్ఠానం తీవ్రం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించి రామకోటయ్య రాష్ట్రపతి ఎన్నికల ఓటింగులో పాల్గొనడాన్ని టిడిపి తీవ్రంగా పరిగణిస్తోంది. ఆయనపై సస్పెన్షన్‌ వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. గత కొంతకాలంగా టిడిపికి దూరంగా ఉంటూ కాంగ్రెస్‌ నేతలతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్న రామకోటయ్య గురువారం పార్టీ ఆదేశాలను బేఖాతరు చేసి రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్నారు. దీనిపై నివేదిక తెప్పించుకున్న పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ రోజో రేపో రామకోటయ్యపై వేటు వేసే అవకాశాలు ఉన్నాయని టిడిపి వర్గాలు తెలిపాయి.