నూతన ఎమ్మెల్సీ ప్రమాణస్వీకారం

` ప్రమాణం చేయించిన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర శాసనమండలి వేదికగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలచేత సోమవారం మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి వారితో ప్రమాణస్వీకారం చేయించారు. శ్రీపాల్‌రెడ్డి, శంకర్‌ నాయక్‌, నెల్లికంటి సత్యం, మల్కా కొమురయ్య, అంజి రెడ్డి తదితరులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్‌, ఎంపీ రఘునందన్‌ రావు, ఎమ్మెల్సీ ఏవిన్‌ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అయితే బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనా దాసోజు శ్రవణ్‌ మరోరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్‌ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్‌, శంకర్‌నాయక్‌, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్‌ఎస్‌ నుంచి దాసోజు శ్రవణ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్‌ పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్య విజయం సాధించారు. అలాగే ఖమ్మం టీచర్‌ ఎమ్మెల్సీ స్థానం నుంచి పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి గెలిచారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన అనంతరం బీజేపీ ఎమ్మెల్సీ అంజి రెడ్డి మాట్లాడుతూ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్సీగా గెలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. పార్టీ నాయకత్వానికి, గెలిపించిన ప్రతి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. హెచ్‌సీయూ భూములు అమ్మాలని ప్రభుత్వం చూస్తోందని, విద్యార్థులపై లాఠీ ఛార్జ్‌ చేయడం దుర్మార్గమన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య మాట్లాడుతూ.. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు.