నెలాఖరులోగా విద్యుత్‌ సమస్యను పరిష్కరిస్తాం

ఇందిరమ్మ బాటలో సీఎం
కాకినాడ, జూలై 16 (జనంసాక్షి):
మరింత మెరుగైన పాలన అందించేందుకు ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడిం చారు. స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ, కలెక్టర్‌ నీతుప్రసాద్‌, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. సమావేశ అనంతరం ముఖ్య మంత్రి తూర్పుగోదావరి జిల్లాలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఇందిరమ్మ బాట పర్యటన వివరాలను తెలియజేశారు. ఆ తరువాత విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఆయన ప్రసంగం ఇలా కొనసాగింది. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిశీలిస్తున్నానని చెప్పారు. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తాను. రంపచోడవరంలో స్త్రీనిధి పథకం ఇంకా ప్రారంభం కాలేదని, ఆ సభ్యులు శిక్షణ తీసుకుంటున్నందున ఆలస్యమైందని అధికారులు చెప్పారన్నారు. వారికి శిక్షణ పూర్తి కాగానే స్త్రీ నిధి చేపట్టాలని ఆదేశించానన్నారు. రంపచోడవరం తదితర ప్రాంతాలలో ఉపాధి హామీ పథకం కింద పనులు వంద రోజులు పూర్తయ్యాయని, మరికొన్ని దినాలు పొడిగించాలని కూలీలు కోరారని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. రంపచోడవరం, ఏజెన్సీ ప్రాంతాలలో 40, 50 ఏళ్ల నుంచి నివసిస్తున్న గిరిజనులకు, గిరిజనేతరులకు ఇళ్ల స్థలాలపై విజ్ఞప్తి చేశారని, ఆ విషయాన్ని పరిష్కరించాలని కలెక్టర్‌కు ఆదేశాలిచ్చానని చెప్పారు. అంతేకాక నివేదిక పంపాలని సూచించానన్నారు. వర్షాకాలం అయినందునా మందులను ముందుగానే నిలువ ఉంచుకోవాలని ఆ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలకు సూచించానన్నారు. వ్యాధులు ప్రబలకుండా వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుని నివారణ చర్యలు చేపట్టాలని కోరానని అన్నారు. ముసురుమిల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో క్రికెట్‌, స్కిప్పింగ్‌ ఆడడం వల్ల బాల్యం జ్ఞప్తికి వచ్చిందని అన్నారు. అ అనుభూతి తనలో మధురంగా నిలిచిపోయిందన్నారు. అంతేకాక ఆశ్రమ పాఠశాల అభివృద్ధికి, సదుపాయల కల్పనకు మూడు కోట్ల రూపాయలను మంజూర చేశానని అన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశ్రమ పాఠశాలల్లోని సమస్యలను, అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రస్తావిస్తూ నివేదిక అందజేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను కోరినట్టు చెప్పారు. ఒక స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రత్యేకంగా కావాలని ఆ విద్యార్థులు కోరారని, క్రీడల్లో వారి ప్రతిభ చూసి స్కూల్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చానన్నారు. అమలాపురంలో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో సమావేశమయ్యానని, సమస్యలపై వారిని అడిగితే ఆ పథకం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. అయితే మరికొన్ని చోట్ల మాత్రం స్వల్ప ఫిర్యాదులు వచ్చాయన్నారు. చికిత్స చేసే విషయంలో పలు ఆస్పత్రుల నిర్వాహకులు తాత్సారం చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయన్నారు. సంబంధిత అధికారులతో చర్చించి ఆ సమస్యను పరిష్కరిస్తానని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు ఐదు సార్లు పర్యటించానని, ఇది ఆరవ పర్యటనని చెప్పారు. రామచంద్రాపురం, ముమ్మడివరం, రంపచోడవరం, కాకినాడ, తునీ, జగ్గంపేట, అమలాపురం, ద్రాక్షారామం, తాళరేవు తదితర ప్రాంతాలలో పర్యటించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలో సదుపాయాలు కల్పించనున్నట్టు చెప్పారు. రాజీవ్‌ యువకిరణాలపై యువతతో మాట్లాడానని, ఆ పథకం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారని చెప్పారు. వారి ఉత్సాహం చూశాక మరింత ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించానన్నారు. ఇంజినీర్‌, పోస్టుగ్రాడ్యుయేట్‌, ఎంసీఏ తదితర ఉన్నత చదువులు అభ్యసించిన నిరుద్యోగులు రాజీవ్‌ యువకిరణాలలో తమ పేరు నమోదు చేసుకున్నారని చెప్పారు. వారికి కూడా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు కల్పించేందుకు అధికారులతో చర్చించాల్సి ఉందన్నారు. ఆ తరువాత తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. 2014 నాటికి 15 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఉద్యోగంలో కొత్తగా చేరిన వారు అడ్వాన్స్‌గా మూడు వేల రూపాయలను ఇవ్వాలని కోరారని, దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అలాగే రాజీవ్‌ యువకిరణాల కింద ఉద్యోగం పొందిన యువతుల కోసం రక్షణతో కూడిన నివాసంలో వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా మత్స్యకార గ్రామాల్లో పర్యటించానని చెప్పారు. వారి సమస్యలను అడిగి తెలసుకున్నాని చెప్పారు. గోదావరి మహా సమాఖ్య సంఘం అన్ని సంఘాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆ సంఘం వల్ల 21వేల కుటుంబాలు లబ్ధి పొందడం తనను అమితంగా ఆకట్టుకుందన్నారు. మత్స్యకార కుటుంబాలు తమ పిల్లల విద్య కోసం 4 కోట్ల రూపాయలను పొదుపు చేసుకోవడం తనను ఎంతో ఆకర్షించిందన్నారు. ఆవిషయంపై వారిని అభినందించానని చెప్పారు. వారు తమ పిల్లల చదువు కోసం రెండు ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లను, ఒక రెసిడెన్షియల్‌ స్కూల్‌ను కోరారని, వాటిని మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. వారు ఇంకా ముందుకు సాగేందుకు కృషి చేస్తానని చెప్పారు. మత్స్య సంపదను నిల్వ చేసుకునేందుకు ప్రత్యేక గోదాములను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే బండారులంకలో చేనేత కార్మికులను కలిశానని, వారి కష్టసుఖాలను తెలుసుకున్నాని చెప్పారు. భారీ వర్షాలు కురిసినప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న మగ్గాలు నీటిలో మునిగిపోతున్నాయని, వాటి నుంచి తమను కాపాడాలని వారు తనను వేడుకున్న దృశ్యం తనను కదిలించిందన్నారు. వెంటనే డ్రైన్లు, మురికి కాలువల ఆధునికీకరణకు నిధులు మంజూరు చేశానన్నారు. ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను కోరానని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో పది లక్షల ఎకరాలు సాగవుతున్నాయని, పూర్తి చేస్తే అదనంగా మరో 5లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అనంతరం ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. రాజీవ్‌ యువకిరణాలకు నిధుల సమస్యల లేదని, అదొక ప్రత్యేకమైన పద్ధతిలో నియామకాలు చేపట్టడం జరుగుతుందన్నారు.