నేటి నీట్‌ పరీక్షకు ఏర్పాట్లు

మార్గదర్శకాలు జారీచేసిన అధికారులు
న్యూఢిల్లీ,మే5(జ‌నం సాక్షి ): నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌)- 2018 ఆదివారం జరగబోతోంది.  అడ్మిట్‌ కార్డులను ఇప్పటికే జారీచేసిన సీబీఎస్‌ఈ.. అభ్యర్థులు పరీక్షకు ఎలాంటి దుస్తులు ధరించాలి? ఎలాంటి దుస్తులు ధరించకూడదు? ఎలాంటి వస్తువులు తీసుకురాకూడదు?వంటి అంశాలపై స్పష్టతనిస్తూ సీబీఎస్‌ఈ తాజాగా మార్గనిర్దేశకాలు జారీచేసింది. అభ్యర్థులు ఉదయం 9.30 గంటలకల్లా పరీక్షా కేంద్రాలకు ఖచ్చితంగా చేరుకోవాలి. ఆ తర్వాత ఏ అభ్యర్థినీ అనుమతించమని సీబీఎస్‌ఈ తేల్చిచెప్పింది. ఇంటి నుంచి దూరం, ట్రాఫిక్‌, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందుగానే పరీక్షా కేంద్రాలకు రావాలని సూచించింది.’నీట్‌’ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తేలికైన హాఫ్‌ స్లీవ్‌ షర్టులు/టీ షర్టులు ధరించాలి. చొక్కాలకు జిప్‌లు, పెద్ద బటన్లు, బ్యాడ్జ్‌లు ధరించకూడదు. విద్యార్థినులూ తేలికైన హాఫ్‌ స్లీవ్స్‌ ధరించాలి. ఎంబ్రాయిడరీ, పువ్వులు, బటన్లు కల్గిన దుస్తులు ధరించకూడదు. విద్యార్థులు కుర్తా-పజామా ధరించకూడదు. ప్యాంట్లు మాత్రమే ధరించాలి. విద్యార్థినులు సల్వార్లు, ట్రౌజర్లు ధరించవచ్చు. ఎట్టిపరిస్థితుల్లో షూస్‌ వేసుకుని వస్తే పరీక్షకు అనుమతించరు. అభ్యర్థులు స్లిప్పర్లు, సాండల్స్‌ మాత్రమే ధరించాలి. విద్యార్థినులకూ ఇది వర్తిస్తుంది. లో హీల్స్‌ సాండల్స్‌ మాత్రమే ధరించాలి. విద్యార్థినులు చెవి రింగులు, ఉంగరాలు, ముక్కుపుడకలు, నెక్లసలు వంటి ఎలాంటి లోహ ఆభరణాలు ధరించి పరీక్షకు రాకూడదు. తమ మతాచారాలను అనుసరించి బురఖాలు, తలపాగాలు ధరించే అభ్యర్థులు.. మే 6వ తేదీ ఉదయం 8.30గంటలకే పరీక్షా కేంద్రానికి రావాల్సి ఉంటుంది. చేతితో రాసిన, లేదా ప్రింట్‌ చేసిన మెటీరియళ్లు, చిన్న కాగితాలు, పెన్సిల్‌, ఎ/-లాస్టిక్‌ పౌచ్‌లు, కాలిక్యులేటర్లు, పెన్నులు, స్కేలు, రైటింగ్‌ ప్యాడ్‌, పెన్‌ డ్రైవ్‌, ఎరేజర్‌, లాగ్‌ టేబుల్‌, ఎలక్టాన్రిక్‌ వస్తువులు తీసుకురావద్దు. మొబైల్స్‌, బ్లూ టూత్‌, ఇయర్‌ ఫోన్లు, హెల్త్‌ బ్యాండులు తేవద్దు. పర్సులు, కళ్లజోళ్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, వాచ్‌లు, బ్రేస్‌లెట్‌లు, మెటాలిక్‌ వస్తువులు, కెమెరా, బెల్ట్‌, టోపీ కూడా నిషేధమని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది.
—————