నేటి నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పైనే చర్చ
భద్రతా ఏర్పాట్లు ముమ్మరం
10 నుంచి 21 వరకు శీతాకాల సమావేశాలు
హైదరాబాద్, నవంబర్ 29 రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు మూడు రోజుల పాటు నిర్వహించాలని సలహాసంఘం నిర్ణయించింది. గురువారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశమైంది. తొలుత రెండు రోజుల పాటే నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనతో విపక్షాలు విభేదించడంతో మరో రోజు పాటు పొడిగించాలని బీఏసీ నిర్ణయించింది. దీంతో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు శుక్ర, శని, ఆదివారాల్లో నిర్వహిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ బడ్జెట్‌కు చట్టబద్దత కల్పించే అంశంపై ముసాయిదాను ఆమోదించేందుకు ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. తొలి రోజు ఎస్సీ, ఎస్టీ ముసాయిదా బిల్లును సభలో ప్రవేశపెట్టడంతో సభ వాయిదా పడుతుంది. మిగిలిన రెండు రోజుల్లో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, విపక్ష నేత చంద్రబాబునాయుడు హాజరుకాలేదు. సమావేశానికి హాజరైన వారిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, టీఆర్‌ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్, వైఎస్సార్ సీఎల్పీ నేత విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో అన్ని అస్త్రాలను ప్రయోగించే అవకాశాలు ప్రతిపక్షాలకు ఉన్నా ఎస్సీ, ఎస్టీ పేరు చెప్పి అధికార పక్షం ప్రతిపక్షాల నోళ్లు నొక్కేస్తోంది. కొద్దిపాటి మెజారిటీతో ప్రభుతాన్ని నడుపుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని గద్దె నుంచి దించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నా ఆ అవకాశాన్ని ఇచ్చే సహసం ప్రభుత్వం చేయలేకపోతోంది. ఇప్పటికే ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సమావేశాలు కేవలం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులకు చట్టబద్దత కల్పించేందుకే ఏర్పాటు చేశామని, ఈ సభల్లో ఇతర అంశాన్ని చర్చకు లేవనెత్తుతే వారు ఎస్సీ, ఎస్టీ వ్యతిరేకులేనని అన్నారు. దీంతో ప్రతిపక్షాల నోళ్లు ఒక్కసారిగా మూగబోయాయి. అయితే ఈ సమావేశాలకు తాను హాజరుకాలేనంటూ చంద్రబాబు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులకు చట్టబద్దతతోపాటు, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ ఆ పార్టీ శాసనసభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. పాదయాత్రలో ఉన్న చంద్రబాబు బుధవారం మెదక్ జిల్లాలోనే శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇతర అంశాలను ప్రస్తావించకున్నా ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని సహచరులకు ఉద్బోధించారు. ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దించుతామా? అంటూ ఎదురు చూస్తున్న జగన్ కూడా ఈ సమావేశాల్లో ఏ ప్రయత్నం చేయలేని పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వానికి సహకరించాలని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చిన అవకాశం చేజారిపోయిందంటూ ఆ పార్టీ ఆందోళనలో పడింది. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల అంశంపై ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తామని ఇదివరకే ప్రకటించింది. దీంతో ఈ మూడు రోజుల సమావేశాల్లో సబ్‌ప్లాన్ నిధుల అంశం తప్ప మరి ఏ అంశం శాసనసభలో చర్చకు వచ్చే అవకాశం కనిపించడంలేదు. టీడీపీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెస్తే మాత్రం అన్ని పార్టీలు ఈ అంశంపై స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రత్యేక సమావేశాలకు పోలీసులు సైతం గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. సాధారణ సమావేశాలకు ఏర్పాటు చేసే సంఖ్యలో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు నగర పోలీస్‌కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఇదిలా ఉండగా, డిసెంబర్ 10 నుంచి 21 వరకు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.