నేడు ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు

1

హైదరాబాద్‌,జులై 18(జనంసాక్షి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక జరుగుతన్న ఆర్టీసి కార్మిక సంఘ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఎన్నికలకు 114 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 51వేల 878 ఓటర్లు ఆర్టీసీ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. 800మంది పోలింగ్‌ సిబ్బందిని ఏర్పాటు చేశారు. రెండేళ్ల పదవీ కాలం కలిగిన పది యూనియన్లలో ఒక్క యూనియన్‌ మినహా.. మిగతా తొమ్మిది యూనియన్లు ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌, కార్మిక యూనియన్‌ లతో పాటు మరో 4 యూనియన్‌ లు ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. ఎన్నికల్లో పాల్గొనే ప్రతి ఆర్టీసీ ఉద్యోగి రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి రాష్ట్రస్థాయి.. మరొకటి జిల్లాస్థాయి ఎన్నికలకు రెండు ఓట్లు వేయాలి. రాష్ట్రస్థాయి పోటీ బ్యాలెట్‌ పేపర్‌ వైట్‌ కలర్‌ లో ఉంటుంది. దీన్నే క్లాజ్‌ 3 ఓటు అంటారు. అన్ని జిల్లాల్లో ఎక్కువ ఓట్లు ఏ సంఘానికి వస్తాయో.. దానిని గుర్తింపు సంఘంగా ఎన్నుకుంటారు. ఇక జిల్లా స్థాయిలో పింక్‌ కలర్‌ బ్యాలెట్‌ పేపర్‌ పై క్లాజ్‌ 6 ఓటు వేయాల్సి ఉంటుంది. 51శాతం ఓట్లు వస్తేనే వారిని జిల్లాస్థాయి గుర్తింపు సంఘంగా గుర్తిస్తారు. జిల్లాస్థాయిలో 51శాతం ఎవరికి రాకుంటేరాష్ట్రస్థాయిలో ఉన్నసంఘమే ఆటోమెటిక్‌ గా జిల్లాస్థాయిలో కూడా గుర్తింపు సంఘమవుతుంది.ఎన్నికలకు సంబంధించిన సరంజామాను సిద్ధం చేసింది కార్మికశాఖ. రేఓటింగ్‌ తర్వాత వెంటనే ఓట్ల లెక్కింపు కూడా మొదలవుతుంది. ఆగస్టు 6న అధికారికంగా ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు. ఈ నెల 25, 26న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను తీసుకుంటామని జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ గంగాధర్‌ అన్నారు . ఓటేసే వారంతా ఆర్టీసి ఐడెంటిటీ కార్డు తప్పనిసరిగా వెంటతీసుకెళ్లాలన్నారు. ఆర్టీసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు  కార్మికశాఖ తెలిపింది.