నేడు ఇల్లెందులో కెసిఆర్‌ సభ

భారీగా ఏర్పాట్లు చేసిన టిఆర్‌ఎస్‌ శ్రేణులు
ఖమ్మం,నవంబర్‌29(జ‌నంసాక్షి): సింగరేణి బెల్టులోని ఇల్లెందులో సిఎం కెసిఆర్‌ 30న ఆశీర్వాద సభ నిర్వహించబోతున్నారు. నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు, కార్యకర్తలు ఇల్లెందుకు పెద్ద ఎత్తున తరలివచ్చి కేసీఆర్‌ సభను విజయవంతం చేసేలా ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్‌ సభను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి, టీఆర్‌ఎస్‌ ఎన్నికల పరిశీలకుడు తాతా మధు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మడత వెంకట్‌గౌడ్‌లు అన్నారు.  కనీవినీ ఎరుగని రీతిలో కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహిస్తామని టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కోరం కనకయ్య పేర్కొన్నారు. 2014 తరువాత తొలిసారిగా కేసీఆర్‌ ఇల్లెందుకు వస్తున్నారు. ఇల్లెందు సింగరేణి పాఠశాల గ్రౌండ్‌లో హెలీప్యాడ్‌ ఏర్పాటు చేసారు. సభకోసం కామేపల్లి, టేకులపల్లి, గార్ల, బయ్యారంలతో పాటు ఇల్లెందు మండల , పట్టణాల నుంచి 70 వేలమందిని తరలించనున్నారు. కేసీఆర్‌ చారిత్రాత్మకంగా నాలుగున్నరేళ్ళు పాలనందించాడన్నారు. ప్రజలకు అనేక విధాలుగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ గోదావరి జలాలు, ఆసరా వంటి పథకాలతో ప్రజలందరి హృదయాలలో స్థానం సంపాదించాడన్నారు. కేసీఆర్‌ను వృద్ధులు పెద్ద కొడుకులా చూస్తున్నారని, వితంతువులు తోబుట్టువుగా పరిగణిస్తున్నారని, వికలాంగులు ఆపద్భాంధవుడిలా చూస్తున్నారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ అందుకున్న ఆడపడుచులంతా కేసీఆర్‌ను మేనమామగా పేర్కొంటున్నారని తెలిపారు. వీరంతా కేసీఆర్‌ రాకకోసం చూస్తున్నారని తండోపతండాలుగా తరలివచ్చేందుకు సిద్దమవుతున్నారన్నారు. తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. వీరంతా కేసీఆర్‌ను ఆశీర్వదించేందుకు ఇల్లెందు పట్టణానికి రావడానికి సమాయత్తమవుతున్నారన్నారు. వచ్చిన కార్యకర్తలు ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు.