నేడు కేసీఆర్‌తో కోదండరాం భేటీ…

 

వేయి ఆలోనలు  గర్షించనీయి.. వంద పూలు వికసించనీయి.

హైదరాబాద్‌, నవంబర్‌ 15 (జనంసాక్షి):

టీఆర్‌ఎస్‌- తెలంగాణ జేఏసీ మధ్యఏర్పడిన వివాదాల పటాపంచలు కానున్నాయి. శుక్రవారం సాయంత్రం 5గంటలకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం భేటీ కానున్నారు. ఇరువరి మధ్య ఏర్పడిన పొరపొచ్చాల గురించి వారు ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం. గత కొంతకాలంగా కేసిఆర్‌, కోదండరాం మధ్య సఖ్యత కొరవడింది. సాగరహారానికి ముందునుంచే ఈ ఇరువురి నేతల మధ్య సత్సంబంధాలు లేవు. సాగరహారం సందర్భంలో కూడా జరిగిన సంఘటనలు టీఆర్‌ఎస్‌ను బాధించాయి. దీంతో కొదండరామంకు ఆ పార్టీతోనూ, నాయకులతోనూ మరింత దూరం పెరిగింది. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన కేసిఆర్‌ జేఏసీలోని  న్యూడెమోక్రసి, టీఎన్జీవో నాయకులతో సంప్రదించారే తప్ప కోదండరాంని గానీ, ఆయన అనుచరులను గానీ చర్చలకు పిలువలేదు. కరీంనగర్‌లో జరిగిన పొలిట్‌ బ్యూరో సమావేశం, సదస్సుకు కూడా కోదండరాం హాజరు కాలేదు. ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఈ ఇరువురి నేతల మధ్య ఉన్న దూరంపై ప్రశ్నించగా పరిష్కరించుకోలేనంత విభేదాలు ఏమీ తమ మధ్య లేవని అయితే కొంత దూరం ఉన్నమాట వాస్తవమేనని కేసీఆర్‌ చెప్పారు. ఆ ప్రకారం జేఏసీతో ఉన్న పొరపొచ్చాలను తొలగించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా రేపు ఈ ఇరువురి నేతలు భేటీ కానున్నారు.