నేడు గంగాదేవిపల్లి వేదికగా గ్రామజ్యోతి

5

– ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ ఆగష్టు 16 (జనంసాక్షి):

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 17న గ్రామజ్యోతి కార్యక్రమం ప్రారంభం కానుంది. వరంగల్‌ జిల్లా గంగదేవిపల్లిలో సోమవారం ఉదయం 11.45 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అక్కడ సీఎం మొక్కను నాటనున్నారు. గ్రామ కమిటీల ద్వారా గంగదేవిపల్లి అభివృద్ధిని స్వయంగా పరిశీలించనున్నారు. గంగదేవిపల్లి గ్రామసభలో కేసీఆర్‌ పాల్గొననున్నారు. అనంతరం మేడిపల్లిలో జరిగే రాంపూర్‌, మేడిపల్లి గ్రామసభలకు హాజరుకానున్నారు. దత్తత తీసుకున్న గ్రామాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం గ్రామజ్యోతిని ప్రాంభించనున్నారు.

ఈమేరకు గంగదేవిపల్లి, మేడిపల్లిలో చేస్తోన్న ఏర్పాట్లను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ సీతారాం నాయక్‌, ఎమ్మెల్యే వినయ భాస్కర్‌, కలెక్టర్‌, పోలీసు ఉన్నతాధికారులు, టీఆర్‌ఎస్‌ నేతలు తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. గంగదేవిపల్లి, మేడిపల్లిలో రేపు సీఎం కేసీఆర్‌ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని తెలిపారు. తమ ప్రభుత్వం అవినీతికి దూరంగా మంచి పనులు చేస్తోన్నా ప్రతిపక్షాలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. విపక్షాలు ఉనికి కోసమే ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయని మండిపడ్డారు.