నేడు గుజరాత్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు
87 నియోజకవర్గాల్లో పోలింగ్ శ్రీమోడీ భవితవ్యానికి అగ్నిపరీక్ష
యువనేత రాహుల్ చరిష్మకు ఫలించేనా ?
గుజరాత్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్ గురు వారం జరగనుంది. ఇందు కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. తొలి దశలో 87 నియోజక వర్గాల్లో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో భారీ భద్రతను చేపట్టారు. మద్యం దుకాణాలను ఈ నెల 17 వరకు మూసి ఉంచాల్సిందిగా ఈసీ ఆదేశించింది. మొదటి దశ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది. ¬రా¬రీ పోరులో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ప్రస్తుత
ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పోటాపోటీగా ప్రచారం చేపట్టారు. మరోవైపు మాజీముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ స్థాపించిన కొత్త పార్టీ ఏ మేరకు ప్రభావం చూపబోతుందనే దానిపైనే కాంగ్రెస్ అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ తరఫున ప్రధాని మన్మోహన్, సోనియా, రాహుల్‌లు విస్తృతంగా ప్రచారం చేశారు. అలాగే అద్వానీ తదతరులు కూడా ప్రచారం చేశారు. అయితే మొత్తంగా మోడీ తన ఛరిష్మాతో ముందుకు దూసుకు వెళుతున్నారు. నరేంద్ర మోడీని ఇబ్బంది పెట్టి, ఆయనపట్ల వ్యతిరేకత ప్రబలేలా చూసేందుకు కేంద్రం ప్రయత్నాలెన్నో చేసిందన్న విమర్శలొచ్చాయి. మోడీ రాజకీయ వేదికలపై ఈ సమస్యను లేవనెత్తారు. ఫలితం లేకపోవడంతో న్యాయస్థానం తలుపు తట్టారు. గుజరాత్ అభివృద్ధికి పునాది వేసింది పండిత్ నెహ్రూనే అని సోనియాగాంధీ తన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. గుజరాత్ అభివృద్ధికి కాంగ్రెస్ చేసినంత కృషి, ఇంకెవరూ చేయలేదన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైనదని, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆమె తాజాగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎస్‌డీపీ)లో బీహార్, ఒడిషా, చత్తీస్‌గఢ్‌లకన్నా గుజరాత్ వెనకబడిపోయిందని కాంగ్రెస్ వాదిస్తోంది. శక్తిమంతమైన గుజరాత్ పేరుతో మోడీ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ వ్యాపార సదస్సులనూ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. గతేడాది జులైలో జరిగిన సదస్సులో రూ.20.83లక్షల కోట్ల విలువచేసే అవగాహన ఒప్పందాలు కుదిరాయని, వాటిలో చాలాభాగం అమల్లోకి రాలేదని కాంగ్రెస్ ఆరోపించింది. స్వతంత్ర సంస్థల అభిప్రాయం కూడా అదేనని పేర్కొంది. అసోచామ్ తాజా నివేదిక ప్రకారం 48.2శాతం ప్రతిపాదనలకు సంబంధించిన పనులు మాత్రం మొదలయ్యాయి. ఆ పెట్టుబడుల్లో అత్యధికం (39.2శాతం) విద్యుత్ రంగంలోకి, తరవాత తయారీ సేవారంగం లోకి వస్తున్నాయి. గుజరాత్‌లో వృద్ధిరేటూ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని కాంగ్రెస్ ఆరోపించింది.. ఈ విషయంలో బిజెపి వాదనల్ని అది కొట్టిపారేస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2004 సంవత్సరాన్నే ప్రాతిపదికగా తీసుకొన్నప్పుడు నాటినుంచి నేటి దాకా దేశీయ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) కన్నా గుజరాత్ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) ఎక్కువగా ఉంటోంది. మోడీకన్నా ముందునుంచే గుజరాత్ అభివృద్ధి పథంలో సాగుతున్నప్పటికీ, మోడీ పాలన కాలంలో అది పరుగులెత్తింది. గుజరాత్ ఒకప్పుడు విద్యుత్తుకు కటకటలాడేదని, ఇప్పుడిది మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారిందని మోడీ సర్కారు చెప్పుకుంటోంది. నగరాల్లోనే కాదు, జ్యోతి గ్రామ యోజన కింద రాష్ట్రంలోని మొత్తం 18,023 గ్రామాలకూ ఇరవై నాలుగు గంటలూ విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నామన్నది బిజెపి వాదన. దాన్ని గణాంక వివరాలతో కాంగ్రెస్ ఖండిస్తోంది. నాలుగున్నర లక్షల రైతులకు నేటికీ విద్యుత్తు అందని మానిపండే అని కాంగ్రెస్ నేతలు తమ ప్రచారంలో ఆరోపించారు. న్యాయపరంగానే కాకుండా, మోడీ ప్రభుత్వాన్ని రాజకీయంగానూ ఢీకొనేందుకు కాంగ్రెస్ శతథా ప్రయత్నిస్తోంది. మోడీ సారథ్యంలో దశాబ్ద కాలంలో గుజరాత్ గొప్ప అభివృద్ధి సాధించిందన్నది పచ్చి బూటకమంటూ కాంగ్రెస్ శక్తివంచన లేకుండా ప్రచారం చేసింది. మోడీ హయాములో గుజరాత్‌లో ఎనిమిది వ్యవసాయ-వాతావరణ మండళ్లు ఏర్పాటుచేశామని భాజపా ప్రచారం చేసుకుంటోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విస్తృతస్థాయిలో వాణిజ్య పంటలు పండించేందుకు అవి తోడ్పడతాయన్నది మోడీ ప్రభుత్వ వాదన. గుజరాత్‌లో అభివృద్ధి పక్రియను ప్రారంభించింది మోడీ కాదు. కానీ, ఆయన హయాములోనే రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్లిందని బిజెపి చెబుతోంది. గుజరాత్‌లో గిరిజనులు అధికంగా ఉన్న వల్సాడ్, సబరకాంత, బనస్కాంత, కచ్ జిల్లాల్లో సైతం పట్టణ ప్రాంత జనాభా భారీగా పెరగడం గమనార్హం. గుజరాత్ అభివృద్ధికి తామే కారణమని చెప్పుకొంటున్నారు. మోడీని గ్దదె దింపడం ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు అంత సునాయాసం కాదు. ఆ రాష్ట్ర జనాభాలో దాదాపు 40శాతం వ్యాపార వర్గమే. మోడీ పాలన కాలంలో వారంతా ప్రయోజనం పొందారు. పాలకులు మారితే తమ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయన్న భయం వారిలో ఉంది. ఈ పరిస్థితుల్లో గుజరాతీలు ఎలాంటి తీర్పు చెప్పబోతున్నారన్నది ఆపక్తికరంగా మారనుంది.