నేడు తెలంగాణ ఎంసెట్‌

3

– నిమిషం ఆలస్యమైనా ఔట్‌

హైదరాబాద్‌,జులై 8(జనంసాక్షి): తెలంగాణలో ఈనెల 9న శనివారం ఎంసెట్‌2 నిర్వహణకు సర్వం సిద్ధమైంది. దీనికోసం పూర్తి ఏర్పాట్లు చేశామని, నిముషం నిబంధన వర్తిస్తుందని కన్వీనర్‌ డాక్టర్‌  ఎన్‌వి రమణారావు స్పష్టం చేశారు. వర్షాకాలం కనుక ఈ విషయాన్ని గమనించి  ముందుగానే కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వైద్యవిద్య సీట్ల భర్తీకి ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.గతంలో ఆయుష్‌, ఫిజియోథెరపీ, వ్యవసాయ, పశువైద్య సీట్ల భర్తీ కోసం తెలంగాణలో తొలి ఎంసెట్‌ను నిర్వహించటం తెలిసిందే. ఎంసెట్‌2కు మొత్తం 56,188 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో  కలుపుకొని 95 కేంద్రాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లుచేశారు. శనివారం ఉ.10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్ష జరుగుతుంది. అదేరోజు సాయంత్రం పరీక్ష ప్రశ్నపత్రం కీని విడుదల చేస్తారు. ఈనెల 12 వరకూ ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. పరీక్ష ఫలితాలను 14న వెల్లడిస్తారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని జేఎన్‌టీయూహెచ్‌ ఎంసెట్‌2 కన్వీనర్‌ రమణరావు స్పష్టంచేశారు. పరీక్ష కేంద్రంలోనికి గంట ముందుగా విద్యార్థులను అనుమతిస్తామన్నారు.  పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం ఆలస్యంగా వచ్చినా లోనికి అనుమతించరు.పరీక్ష పూర్తయ్యే వరకూ వెలుపలికీ పంపమన్నారు.  పరీక్ష కేంద్రంలో ప్రవేశించడానికి ముందే హాల్‌టికెట్‌ను అందజేయాలి. లేకుంటే అనుమతించరు.  విద్యార్థి తన వెంట బ్లాక్‌/బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్ను, పూర్తిచేసిన ఆన్‌లైన్‌ దరఖాస్తు పత్రం, హాల్‌టికెట్‌ను మాత్రమే తీసుకెళ్లాలి.  పరీక్ష పూర్తయ్యాక ఓఎంఆర్‌ సమాధాన పత్రంతోపాటు పూర్తిచేసిన ఆన్‌లైన్‌ దరఖాస్తు పత్రాన్నీ అందజేయాలి. లేదంటే విద్యార్థి ఫలితాన్ని ప్రకటించరు.  కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్లు తదితరాలను అనుమతించరు.  ఓఎంఆర్‌ పత్రంపై ముద్రించిన కోడ్‌.. ప్రశ్నపత్రంపై ముద్రించిన కోడ్‌ ఒకటేనా? కాదా? అనేది సరిచూసుకోవాలని సూచించారు. ఎంసెట్‌2కు హైదరాబాద్‌ నుంచి అత్యధికంగా 20,663 మంది దరఖాస్తు చేసుకోగా, అత్యల్పంగా ఆదిలాబాద్‌ జిల్లా నుంచి 933 మంది నమోదయ్యారు. ఆంధప్రదేశ్‌ నుంచి కూడా తిరుపతి(3,591), విజయవాడ(7,542), విశాఖపట్నం(4,100), కర్నూలు(2,710) జిల్లాల్లోనూ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లో అత్యధికంగా 30 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయగా, ఆదిలాబాద్‌(3), కరీంనగర్‌(8), ఖమ్మం(4), మహబూబ్‌నగర్‌(4), నల్గొండ(5), నిజామాబాద్‌(5), వరంగల్‌(8), కర్నూలు(4), తిరుపతి(5), విజయవాడ(13), విశాఖపట్నం(6)లలోనూ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు పూర్తిచేశారు.