నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

5w

న్యూఢిల్లీ/హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జనంసాక్షి):

కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతోంది. కార్మిక హక్కులపై దాడి జరుగుతోందని, విదేశీ కంపెనీలకు అనుకూలంగా కేంద్రం కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతోందని కార్మిక సంగాలు ఆరోపిస్తున్నాయి. మోడీ అధికారంలోకి వచ్చాక కార్మిక హక్కులకు భంగం వాటిల్లుతోందని ఆరోపించాయి. విదేశీ కార్పొరేట్‌ కంపెనీల కోసం కార్మిక చట్టాల సవరణ, ఉద్యమాలపై ఉక్కుపాదం మోపే దిశలో సర్కారు తీసుకుంటున్న చర్యలకు పెరుగుతున్న ప్రతిఘటన, ఐక్య ప్రతిఘటనలకు తలొగ్గి చేసుకున్న ఒప్పందాలను అమలు చేయని నిర్లక్ష్యం, లే అవుట్‌లు, లే ఆఫ్‌లకు విచ్చలవిడి అనుమతుల వంటి ప్రభుత్వ చర్యల నేపథ్యంలో రాష్ట్రంలో జరగనున్న సమ్మె ప్రాధాన్యత సంతరించుకుంది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దుష్ట ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికలోకం మరోసారి దేశ వ్మాప్తంగా సమ్మె శంఖా రావాన్ని మోగించనుంది. బుధవారం జరగనున్న ఈ చారిత్రాత్మక సమ్మెకు ఇప్పటికే సన్నాహాలు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా  కార్మి కులు, ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు.  రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా మద్దతు పలకడం, తమ డిమాండ్లతో ఒక రోజు ముందునుండే ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు.  గతంలో ఎన్నడూలేని విధంగా వ్యక్తమైన ఈ ఐక్యత కేంద్ర ప్రభుత్వాన్ని కలవరానికి గురి చేస్తోంది. సమ్మెను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా అనేక కుయుక్తులకు దిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అనుబంధ కార్మిక సంఘమైన బిఎంఎస్‌ మినహా మిగిలిన అన్ని సంఘాలూ సమ్మె జెండాను ఎత్తుకున్నాయి. ఇదిలావుంటే సన్నాహకంగా సోమవారం నాడు రాష్ట్రమంతా బైక్‌ ర్యాలీలు, ప్రదర్శనలతో ¬రెత్తింది. మంగళవారం కూడా పెద్దఎత్తున ప్రచార కార్యక్రమం చేపట్టారు. సమ్మెకు మద్దతుగా రైతులు, వ్యవసాయ కార్మికులు మండల కార్యాలయాలు, కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఎపి ఎన్‌జిఓలు కూడా సమ్మెకు మద్దతు పలికారు. సమ్మె సన్నాహాలో భాగంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు రాష్ట్ర వ్మాప్తంగా నిర్వహించిన బస్సు యాత్రకు భారీ స్పందన లభించింది. బస్సు యాత్రలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కార్మికనేతలు పర్యటించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికులు, రైతాంగం సమస్యలపై అవలంబిస్తున్న విధానాలకు  నిరసనగా  2న రాష్ట్రంలోని అన్ని మండల డివిజన్‌ కేంద్రాల వద్ద జరిగే సార్వత్రిక కార్మకుల సమ్మెను విజయవంతం చేయాలని ఏపి వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పిలుపునిచ్చారు. సరళీకృత విధానాల పేరుతో కేంద్రం, రాష్ట్రం వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేశాయన్నారు. రైతాంగం వ్యవసాయం గిట్టుబాటుగాక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, వ్యవసాయ కార్మికులు పనులు లేక వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూదాహంతో ప్రభుత్వాలు పేదలు, దళితులు సాగు చేసుకుంటున్న అసైన్డ్‌, ప్రభుత్వ భూముల్ని కార్పోరేట్‌ శక్తులకు కట్టబెడుతూ రివర్స్‌ భూ సంస్కరణలను చేస్తున్నాయి. టిడిపి ప్రభుత్వం భూ బ్యాంకు పేరుతో లక్షల ఎకరాలను కార్పోరేట్‌ శక్తులకు కట్టబెట్టడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసిందన్నారు.ఉల్లిపాయలు, పప్పుల ధరలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్యుల బతుకు ఛిద్రమవుతోందన్నారు. ఈ సమ్మెలో ఉపాధిహావిూ కూలీలు, మేట్‌లు, అధికసంఖ్యలో పాల్గోవాలని పిలుపునిచ్చారు. ఈ సార్వత్రిక సమ్మెకు బీజేపీ అనుబంధ సంస్థ బీఎంఎస్‌ తప్ప టీడీపీ, టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘాలతోపాటు ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్‌ ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, యూటీయూసీ, ఎల్‌ పీఎఫ్‌ ట్రేడ్‌ యూనియన్లు పాల్గొననున్నాయి. కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మె యథాతథంగా జరుగుతుందని ట్రేడ్‌ యూనియన్ల నాయకులు గురుదాస్‌ దాస్‌ గుప్త, తపన్‌ సేన్‌, అశోక్‌ సింగ్‌ ఢిల్లీలో ప్రకటించారు. సీఐటీయూ తెలం గాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు, టీఎన్‌టీయూసీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి. ఎంకె. బోస్‌, ఏఐటీయూసీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్‌రావు, తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు జంగారెడ్డి తదితరులు సమ్మెకు మద్దతు పలికారు. కాగా..కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రోడ్డు భద్రత బిల్లును వ్యతిరేకిస్తున్న ఆటో యూనియన్‌లు ఆందోళనలకు సిద్దమవుతున్నాయి. మరోవైపు సమ్మెకు ఏపీఎన్జీవో, టీఎన్జీవో ఉద్యోగ సంఘాలు మద్దతు పలుకుతున్నాయని ఇరు సంఘాల అధ్యక్షులు అశోక్‌ బాబు, రవీందర్‌రెడ్డి వెల్లడిం చారు. కార్మిక చట్టాల సవరణతో కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నాలను కేంద్రం ఉపసం హరించుకోవాలని,. 50మంది కాంట్రాక్టు కార్మికులుంటే ఎలాంటి కార్మిక చట్టాలు పాటించనవసరం లేదన్న సవరణను తొలగించాలన్నారు.  కార్మిక చట్టం కుదింపు పేరుతో 5కోడ్‌లుగా మార్చే ప్రతిపాద నను విరమించుకోవాలని, కనీస వేతనాన్ని 15 వేలుగా నిర్ణయించాలని డిమాండ్‌ చేస్తున్నారు.