నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ -47

– శ్రీవారిని దర్శించుకున్న శివన్‌
చిత్తూరు, నవంబర్‌26(జనం సాక్షి) : తిరుమల వెంకటేశ్వర స్వామివారిని ఇస్రో చైర్మన్‌ శివన్‌ దర్శించుకున్నారు. మంగళవరాం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. పీఎస్‌ఎల్‌వీ -సీ47 వాహకనౌక నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి స్వామివారి ఆశీస్సుల పొందారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని
అందజేశారు. ఈసందర్భంగా శివన్‌ మాట్లాడుతూ.. బుధవారం ఉదయం 9.20గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ -47 ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు పొందేందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే బుధవారం చేపట్టనున్న పీఎస్‌ఎల్‌వీ సీ-47 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 5 గంటల 28 నిమిషాలకు ప్రారంభమైన ఈ కౌంట్‌డౌన్‌ 26 గంటలపాటు కొనసాగనుంది. బుధవారం ఉదయం 9.28 గంటలకు శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-47ను నింగిలోకి పంపనున్నారు. ఈ రాకెట్‌ ద్వారా 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్‌-3 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. అలాగే అమెరికాకు చెందిన 13 కమర్షియల్‌ నానో ఉపగ్రహాలు రోదసిలోకి పంపించనున్నారు. ఇందులో 12 సీఎల్‌ఎస్‌వి-4పీ అనే బుల్లి ఉపగ్రహాలు, మెష్‌బెడ్‌ అనే మరో బుల్లి ఉపగ్రహం ఉండనుంది. ఇది షార్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 74వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ సీ-47 ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్‌ శివన్‌ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ-47 ప్రయోగం విజయవంతమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.