నేడు మూలానక్షత్రం

అమ్మవారి దర్శనానికి భారీగా రానున్న భక్తులు
అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు: సిపి
విజయవాడ,అక్టోబర్‌4 (జనంసాక్షి):   శనివారం మూలా నక్షత్రం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ గుడికి భక్తుల రద్దీ భారీగా ఉంటుందన్న అంచనా మేరకు భద్రతా చర్యలు చేపట్టారు. తర్వాత రోజు కూడా ఇది  ఉంటుందని అంచనా వేశామనినగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా ఆలయ అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఊహించిన విధంగానే ఈ మూడు రోజులు భక్తులు తరలివస్తున్నారన్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. కొండ పైకి అన్ని రకాల వాహనాలను నిలిపివేశామని సీపీ పేర్కొన్నారు. విధులు నిర్వహించే వారి ద్విచక్ర వాహనాలకు కూడా అనుమతి లేదన్నారు. శనివారం మూలా నక్షత్రం కావడంతో మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. అంతరాలయ దర్శనం పూర్తిగా ఆపేసి.. ముఖ మండప దర్శనం వరకే అనుమతిస్తామన్నారు. సీతమ్మ పాదాల వద్ద కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేసి విడతల వారీగా క్యూలైన్లలో భక్తులను అనుమతిస్తామన్నారు. ఎంత రద్దీ ఉన్నా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రేపు అందరూ సాధారణ భక్తులేనని… వంద, మూడు వందలు టిక్కెట్‌లను రద్దు చేశామన్నారు. ప్రొటోకాల్‌ ప్రముఖులను మాత్రం ప్రత్యేక మార్గంలో దర్శనానికి
అనుమతిస్తామని ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు.