నేడు మేధావులతో కాంగ్రెస్ భేటీ
హాజరు కానున్న ఉత్తమ్
వరంగల్,సెప్టెంబర్27(జనంసాక్షి): కొండా సురేఖ దంపతులు చేరికతో వరంగల్ కాంగ్రెస్‌లో ఉత్తేజం రాగా, పాతకాపులను మళ్లీ కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 28వ తేదీన వరంగల్‌కు రానున్నట్లు తెలిసింది. హసన్‌పర్తిలోని జీఎంఆర్ గార్డెన్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేధావులు, వివిధ వర్గాల ప్రతినిధులు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశం కానున్నట్లు సమాచారం. వీరితో కాంగ్రెస్ గెలుపు ఆవశ్యకతపై చర్చినున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపనున్నారు. ఇదిలావుంటే జిల్లాలో టిఆర్‌ఎస్ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. వివిధ నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలను రప్పించేందుకు ప్రయత్నాలు మొఓదలయ్యాయి. ఉత్తమ్ రానున్న సభలో వరంగల్ పార్లమెంట్ ఇన్‌చార్జి శ్రీనివాసన్ కూడా హాజరు కానున్నట్లు తెలిసింది. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. కాగా, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే ములుగు అసెంబ్లీ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఉన్న మంత్రి చందూలాల్‌ను మార్చకుంటే టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని, ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోచన చేయాలని అసమ్మతి నాయకులు కోరారు. ఈ మేరకు తమ మద్దతుదారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకుడు మోతె రాజు ఆధ్వర్యంలో 100మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ జెండాలను ప్రదర్శిస్తూ కోలాటం, డప్పుకళాకారులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ములుగు నియోజకవర్గం కేవలం మంత్రి చందూలాల్ వైఫల్యంతోనే వెనుకబాటుకు గురైందన్నారు. ఆయన నిర్లక్ష్యం వల్లే బస్‌డిపో ఏర్పాటు ఆగిపోయిందని, ములుగు జిల్లా ఏర్పాటు కాలేదని, జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం నిలిచిపోయిందని ఆరోపించారు. నామినేటెడ్ పదవులను కుటుంబసభ్యులు, బంధువులకు కట్టబెట్టుకొని కార్యకర్తలను చిన్నచూపు చూశారని అన్నారు. అసమ్మతి నాయకులమంతా ఐక్యంగా ఉన్నామని, తమలో ఎవ్వరికి టిక్కెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంతో ప్రస్తుతం తమకు పరిస్థితి అనుకూలంగా మారిందని ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన సీతక్క అన్నారు. ఆమెకు దాదాపుగా ఇక్కడ కాంగ్రెస్ టిక్కెట్ ఖరారు కానుంది. కాంగ్రెస్ నేతలు కూడా దీనిని అవకావంగా తీసుకుని ప్రచారం చేయాలని భావిస్తున్నారు.