నేడు సభముందుకు అత్యాచార నిరోధక బిల్లు

శృంగార వయస్సు 16 కాదు 18
న్యూఢిల్లీ, మార్చి 18 (జనంసాక్షి) :
అత్యాచార నిరోధక బిల్లును మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. బిల్లుపై కేంద్ర ప్రభుత్వం సోమవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో చర్చోపచర్చలు జరిగాయి. బిల్లు విషయంలో చాలా వరకూ అందరూ
ఏకీభవించినా.. కొన్ని నిబంధనలపై మాత్రం భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా పరస్పర అనుమతితో కూడిన శృంగారానికి అనుమతి వయస్సును 18 నుంచి 16కి తగ్గించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బిల్లులోని కొన్ని నిబంధనలు దుర్వినియో గమయ్యే అవకాశముందని బీజేపీ, సమాజ్‌వాదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో అఖిలపక్ష సమావేశం ఎలాంటి అభిప్రాయానికి రాకుండానే ముగిసింది. బిల్లు విషయమై అనేక అంశాలపై అన్ని పార్టీల నుంచి ఏకాభిప్రాయం వ్యక్తమైనా.. కొన్ని ప్రొవిజన్స్‌ మాత్రం దుర్వినియోగమయ్యే అవకాశముందని కొన్ని పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ తెలిపారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బిల్లుపై ఏకాభిప్రాయం తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. మరోమారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, సందిగ్ధతతకు తెరదించుతామని తెలిపారు. వివాహ వయస్సును 18కి పరిమితిం చేసినప్పుడు, శృంగార వయస్సును కూడా 18కి పరిమితం చేయాల్సిందేనని స్పష్టం చేశాయి. ఇతర పక్షాలు మాత్రం శృంగార వయస్సును 16కు తగ్గించడాన్ని అంగీకరించాయి. వివాహానికి ముందు శృంగారాన్ని అనుమతిస్తే తప్పేమీ లేదని తెలిపాయి. అయితే, మిగతా నిబంధనలు దుర్వినియోగమయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశాయి. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు ఆయా నిబంధనల కింద తప్పుడు కేసులు పెట్టే అవకాశముందని పేర్కొన్నాయి. బిల్లుపై సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తం కాకపోవడంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది. ఈ నేపథ్యంలో మరోమారు చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. బిల్లును మరో మూడ్రోజుల్లో ఆమోదించాల్సి ఉండడంతో.. ప్రభుత్వం కేబినెట్‌ సమావేశాన్ని నిర్వహించి పరస్పర అంగీకారంతో శృంగార వయస్సును 18 ఏళ్లకు పెంపునకు ఆమోదముద్ర వేసింది. మార్చిన ఈ నిబంధనలతో పార్లమెంట్‌ ముందుకు బిల్లును తీసుకురానున్నట్లు ప్రభుత్వ పెద్దలు తెలిపారు.