నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌లో తెరాస బహిరంగ సభ

హాజరుకానున్న కేసీఆర్‌

ఈనాడు`వరంగల్‌

మాజీ మంత్రి కడియం శ్రీహరి తెదేపాను వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ సోమవారం సాయంత్రం 4 గంటలకు స్టేషన్‌ ఘన్‌పూర్‌లో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీనికి తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, శాసన సభాపక్ష నేతలు కే. కేశవరావు, పేర్వారం రాములు, మధుసూదనాచారి, చందూలాల్‌, ఎమ్మెల్యేలు, కళాకారులు దేశపతి శ్రీనివాస్‌, రసమయి బాలకిషన్‌ హాజరు కానున్నారు. బహిరంగ సభ కోసం మైదానాన్ని చదును చేశారు. వేదిక నిర్మాణం, ఇతర పనులు చేపట్టారు. జిల్లాలోనే కడియం శ్రీహరి చేరిక కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నారు. వీలుకాకపోవడంతో తెలంగాణ భవన్‌లోనే ముగించారు. ఇతర పార్టీలకు బలమైన సంకేతాలు పంపించాలంటే బహిరంగ సభే సరైనదిగా తెరాస నేతల యోచన. అందుకే శ్రీహరి సొంత నియోజకవర్గమైన స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఈ సభను జరుపుతున్నారు. ఇందులో మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, మండల స్థాయి నేతలతోపాటు వరంగల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పలువురు మాజీ కార్పొరేటర్లు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలకు గులాబీ జెండాలను కప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభలో తెరాస అధినేత కేసీఆర్‌, కడియం శ్రీహరి మరో ముగ్గురు, నలుగురు నేతలు మాత్రమే ప్రసంగించనున్నారు. చాలా కాలం తర్వాత జిల్లాలో పార్టీ తరపున రాజకీయ సభకు కేసీఆర్‌ రానుండటంతో నేతలు భారీగా జనాలను తరలించేందుకు సిద్దమవుతున్నారు.