నేడే ‘మహా’ బలపరీక్ష

– సాయంత్రం 5గంటల్లోపు బలపరీక్ష జరపాలి
– కీలక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
– ప్రోటెం స్పీకర్‌ సమక్షంలో బ్యాలెట్‌ విధానం ద్వారా ప్రక్రియ
– బలపరీక్షను ప్రత్యక్షప్రసారం చేయాలి
– రాజ్యాంగ నైతికతను అన్ని పక్షాలు కాపాడాల్సిన అవసరం ఉంది
– కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం
– బలపరీక్షకు 15రోజులు గడువు కావాలనికోరిన బీజేపీ
– నిరాకరించిన న్యాయస్థానం
– బలపరీక్షలో విపక్షాలదే గెలుపు – సోనియాగాంధీ
– సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తంచేసిన విపక్షాలు
న్యూఢిల్లీ, నవంబర్‌26(జనం సాక్షి) : బీజేపీకి సర్వోన్నత న్యాయస్ధానంలో చుక్కెదురైంది. మహారాష్ట్ర వ్యవహారాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. దేవేంద్ర ఫడ్నవీస్‌ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఐదు గంటలలోగా బలనిరూపణ చేసుకోవాలని స్పష్టం చేసింది. బహిరంగ బ్యాలెట్‌ విధానంలో పక్రియ పూర్తిచేయాలని స్పష్టంచేసిన సుప్రీంకోర్టు, ఈలోగా ప్రొటెం స్పీకర్‌ను నియమించాలని, బలపరీక్ష ఒక్కటే అజెండాగా సమావేశం జరగాలని సూచించింది. సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం బలపరీక్షను ప్రొటెం స్పీకర్‌ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేగాక.. బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని న్యాయస్థానం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిలో రాజ్యాంగ నైతికతను అన్ని పక్షాలు కాపాడాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.
బాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ అవకాశం ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఎదుట సోమవారం వాదనలు ముగిశాయి. దీంతో మంగళవారం తీర్పు వెలువరించింది.
బలాబలాలు ఇలా..
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల్లో భాజపా 105 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేనకు 56, కాంగ్రెస్‌కు 44, ఎన్సీపీకి 54 సీట్లు వచ్చాయి. మరో 29 చోట్ల చిన్న పార్టీలు, ఇతరులు గెలుపొందారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఎన్నికల్లో ఎన్డీయే కూటమితో కలిసి పోటీ చేసిన శివసేన ఫలితాల తర్వాత భాజపాతో విబేధాలు రావడంతో కూటమి నుంచి విడిపోయింది. అనంతరం ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకుని ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ మద్దతుతో దేవేంద్ర ఫడణవీస్‌ నేతృత్వంలో భాజపా సర్కార్‌ ఏర్పడింది. దీంతో శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీలు సుప్రీం తలుపుతట్టాయి.
సుప్రీం తీర్పు నేపథ్యంలో బుధవారం బలపరీక్ష జరగనుంది. ఈ సందర్భంగా పార్టీల బలాబలాలను పరిశీలిస్తే.. ఎన్సీపీ, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో తమకు 170 మంది సంఖ్యాబలం ఉందని భాజపా చెబుతోంది. అయితే శివసేన-కాంగ్రెస్‌-ఎన్సీపీ త్రయం కూడా తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్దతుందని
చెప్పింది. సోమవారం ఈ మూడు పార్టీలు సంయుక్తంగా సమావేశమై.. 162 మంది ఎమ్మెల్యేలతో బలప్రదర్శన చేశాయి. ఇదిలాఉంటే ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా అజిత్‌ పవార్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకొన్నారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా అజిత్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో అజిత్‌కు విప్‌ జారీచేసే అవకాశం ఉందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. మరి బలపరీక్షలో భాజపా నెగ్గుతుందో.. ఎన్సీపీ ఎమ్మెల్యేల ఓటు ఎటో తెలియాలంటే బుధవారం సాయంత్రం వరకు ఆగాల్సిందే.
సుప్రీం తీర్పు చరిత్రాత్మకం  – సోనియా గాంధీ
మహారాష్ట్ర అసెంబ్లీలో దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఐదు గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ స్వాగతించారు. సుప్రీం కోర్టు తీర్పు చరిత్రాత్మకమని అభివర్ణించారు. బలపరీక్షలో విపక్షాలదే విజయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇక సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని శివసేన పేర్కొంది. ఇది ప్రజాస్వామ్య విజయమని తెలిపింది. సుప్రీం ఉత్తర్వులతో శివసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీం తీర్పు అనంతరం ఖేల్‌ ఖతం అంటూ ఆ పార్టీ నేత నవాబ్‌ మాలిక్‌ ట్వీట్‌ చేశారు.
ప్రొటెం స్పీకర్‌ కోసం ఆరుగురి పేర్లు ప్రతిపాదన..
మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారమే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా ఎవరిని నియమించాలన్న దానిపై తర్జన భర్జన కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్‌ పదవి కోసం ప్రస్తుత ప్రభుత్వం.. ఆరుగురి పేర్లను ప్రతిపాదించింది. ఆ ఆరుగురి పేర్లను గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీకి పంపించారు. రాధాక అష్ణ వైఖే పాటిల్‌(బీజేపీ), కాళిదాస్‌ కోలంబ్కర్‌(బీజేపీ), బాబన్‌రావు భికాజీ(బీజేపీ), బాలసాహెబ్‌ థోరత్‌(కాంగ్రెస్‌), కేసీ పద్వి(కాంగ్రెస్‌), దిలీప్‌ వాల్సే పాటిల్‌(ఎన్సీపీ) పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. వీరిలో అత్యంత సీనియర్లు.. బాలసాహెబ్‌ థోరత్‌, కాళిదాస్‌ కోలంబ్కర్‌. సభలో అత్యంత సినీయార్టి ఉన్న వారికే ప్రొటెం స్పీకర్‌ పదవిని అప్పజెప్పడం జరుగుతుంది. ఈ ఆరుగురిలో ఒక్కరి పేరును గవర్నర్‌ ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రోటెమ్‌ స్పీకర్‌ అంటే తాత్కాలిక స్పీకర్‌. అధికారిక స్పీకర్‌ ఉండడు కాబట్టి.. బలపరీక్షకు కావాల్సిన తతంగం అంతా ఆయన చేతులవిూదుగానే సాగాల్సి ఉంటుంది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఇచ్చిన లేఖ ప్రకారం.. గవర్నర్‌ ప్రోటెమ్‌ స్పీకర్‌ను నియమించడం జరుగుతుంది. బుధవారం సాయంత్రం 5 గంటల లోపే బల నిరూపణ జరగాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఇప్పుడు కీలక బాధ్యతలన్నీ ప్రోటెమ్‌ స్పీకర్‌ ఆధీనంలోనే ఉంటాయి.