నేతలకు టీచర్లు సేవకులా?
– డెప్యూటేషన్‌లు చెల్లవు
– పీఏ, పీఎస్‌లను వెంటనే వెనక్కి పంపండి
– సుప్రీం గుస్సా
న్యూఢిల్లీ,జులై 13(జనంసాక్షి): పాఠాలుచెప్పాల్సిన టీచర్లు ప్రైవేట్ సెక్రటరీలుగా వెళ్లడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపిలకు వీరిని డిప్యూటేషన్‌పై పంపడాన్ని తప్పు పట్టింది. వెంటనే దీనిని రద్దు చేసి, అలా వెల్లిన వారిని వెనక్కి పంపాలని ప్రభుత్వాలను ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లేమిపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని విచారణ సందర్భంగా న్యాయస్థానం స్పష్టం చేసింది. పాఠశాలల్లో సున్నా ప్రవేశాలపై అమికస్ క్యూరీ కమిటీ కోర్టుకు నివేదిక సమర్పించింది. అమికస్ క్యూరీ కమిటీ పేర్కొన్న కొన్ని అంశాలతో సర్వోన్నత న్యాయస్థానం విభేదించింది. తెలంగాణలోని జీరో హాజరు స్కూళ్లపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లోనూ ఆంగ్ల మాధ్యమంపై ఆసక్తి చూపుతున్నారని కమిటీ నివేదికలో పేర్కొంది. ఉపాధ్యాయులను ఎమ్మెల్యేలు, ఎంపీలకు సెక్రటరీలుగా డిప్యుటేషన్‌పై పంపడాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం.. వెంటనే ఆవిధానాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఉపాధ్యాయులకు టి.ప్రభుత్వం కల్పిస్తున్న వసతులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పీఏలుగా డిప్యూటేషన్లపై వెళ్తున్న ఉపాధ్యాయులను వెనక్కి రప్పించాలని, డిప్యుటేషన్లను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణలో భాగంగా పర్యవేక్షకుల పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదని సుప్రీం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ వ్యవహారానికి సంబంధించి 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. టీచర్లను ఎంపీలు, ఎమ్మెల్యేలకు పీఏలుగా పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు వెంటనే ఆ విధానాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై నాలుగు వారాల్లో అఫిడవిట్ సమర్పించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు సూచించింది. తెలంగాణలోని విద్యాశాఖలో 90శాతం సూపర్‌వైజర్ క్యాడర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని తల్లిదండ్రుల సమాఖ్య కోర్టు దృష్టికి తెచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉపాధ్యాయుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల గడువు కోరింది. రాష్ట్ర విజ్ఞప్తిని అంగీకరించిన జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం .. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.