నేను అమాయకుడ్ని.. నమ్మండి

ఆరోపణలు నిరాధారమన్న మాజీ ఎయిర్‌ చీఫ్‌ త్యాగి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (జనంసాక్షి) :
హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో జరిగిన ఆర్థిక అవకతవకల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను మాజీ ఎయిర్‌ చీఫ్‌ ఎస్‌పీ త్యాగి ఖండించారు. తాను అమాయకుడినని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. చాపర్ల కొనుగోళ్ల 2010లో జరిగిందని… తాను 2007లోనే పదవీ విరమణ చేసినట్లు చెప్పారు. విచారణ అనంతరం వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు. బుధవారం ఢిల్లీలో త్యాగి విలేకరులతో మాట్లాడారు. 12 హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో భారత అధికారులకు రూ.3,600 కోట్ల మేర లంచం ఇచ్చినట్లువెల్లువెత్తిన ఆరోపణలపై ఆయన స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపడేశారు. ‘నేను అమాయకుడిని. ఆ ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారం. ఒప్పందం జరిగింది 2010లో.. కానీ నేను పదవీ విరమరణ చేసింది 2007లోనే’ అని స్పష్టం చేశారు. విక్రయ సంస్థ ఫినామెనికకు అనుకూలంగా ఒప్పందంలో ఏమైనా మార్పులు జరిగాయా? అని విలేకరులు ప్రశ్నించగా… ‘వీవీఐపీల కోసం అత్యంత నాణ్యమైన చాపర్లు 2003లోనే నిర్ణయం తీసుకున్నారు. నాటి నిబంధనలను వైమానిక దళం కానీ, ఎయిర్‌ స్టాఫ్‌ కార్యాలయం గానీ ఎలాంటి మార్పులు మార్చలేదు’ అని తెలిపారు. తన పదవీకాలంలో ఎలాంటి మార్పులుచేర్పులు చేయలేదన్నారు. కుంభకోణంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన ముగ్గురు విూ సన్నిహితులేనని వస్తున్న వార్తలను ప్రస్తావించగా… మాజీ ఐఏఎఫ్‌ కెప్టెన్‌ త్యాగి తనకు బంధువని, అయితే, ఈ వ్యవహారంలో దానికి సంబంధం లేదన్నారు. ‘ఆ ముగ్గురు నాకు బంధువులేనన్న విషయం నిజం. కానీ వారితో నాకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు. నేను సర్వీస్‌లో ఉన్న సమయంలో వారితో టచ్‌లోనే లేను’ అని వివరించారు. చాపర్ల కొనుగోలు ఒప్పందంలో అనుకూలంగా వ్యవహరించినందుకు ఇటలీ సంస్థ ముడుపులు ఇచ్చినట్లు వచ్చిన వార్తలపు స్పందిస్తూ.. తాను తుఫానులో చిక్కుకున్నానని త్యాగి అన్నారు. అయితే, విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. ‘నేను కేవలం దర్యాప్తుకు సిద్ధంగా ఉండడమే కాదు.. దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నా’ అని చెప్పారు. కుంభకోణం ఆరోపణలు వచ్చినప్పుడు అందులోని నిజానిజాలు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2004 నుంచి 2007 వరకు ఎయిర్‌ చీఫ్‌గా పని చేసిన సమయంలో నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. ‘నా హయాంలోనే టెండర్‌ విడుదలైంది. టెండర్‌ దక్కించుకున్న ఆగస్టా వెస్ట్‌ల్యాండ్‌ సంస్థ కోసం అవసరం లేకున్నా అవసరమన్నారని చెప్పడం సరికాదు. రిక్వైర్‌మెంట్స్‌ను ఎయిర్‌ హెడ్‌క్వార్టర్స్‌ మార్చలేదు. ఇదేం కిరాణ కొట్టుకాదు.. దీనికో వ్యవస్థ ఉంది. ఎయిర్‌ హెడ్‌క్వార్టర్స్‌ కేవలం సిఫార్సులు మాత్రమే చేస్తుంది తప్పితే ఆమోదం తెలపదు’ అని వివరించారు.