నేను ఆ సిఫారసు చేయలేదు
– లలిత్‌మోడీకి సహకరించలేదు
న్యూఢిల్లీ, ఆగస్టు 3 (జనరసాక్షి ) :
తాను లలితో మోడీ కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి ఎలాంటి సిఫారసు చేయలేదని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని కేంద్రమంత్రి రాజ్యసభలో అన్నారు. లలిత్‌మోదీకి వీసా కోసం తాను సిఫార్సు చేయలేదని వివరణ ఇచ్చారు. విపక్షాలు డిమాండ్ చేస్తున్న అన్ని అంశాలపై సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సుష్మాస్వరాజ్ ప్రకటించారు. సభలో ఆమె ప్రకటన చేస్తున్న సమయంలో విపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేశారు. అయితే సుష్మ తన నిజాయితీపై ప్రకటన చేస్తుండగా అధికారపక్ష సభ్యులు బల్లలు చరిచారు. విపక్షాలు చేస్తున్నట్లుగా తానెలాంటి అక్రమాలకు పాల్పడలేదని సుష్మ స్వరాజ్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. రాజ్యసభలో ఆమె ఆ ఆరోపణలకు సంబందించి వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు అడ్డుకున్నారు.దాంతో సభలో అదికార,విపక్షాల మధ్య గందరగోళం ఏర్పడింది. ఫలితంగా సభ వాయిదా పడింది.తాను ఎక్కడా ఎవరికీ ఎలాంటి సిఫారసులు చేయలేదని ఆమె చెప్పారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు.లలిత్ మోడీ వీసా గురించి తాను బ్రిటన్ ప్రభుత్వంతో మాట్లాడలేదని సుష్మ తెలిపారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ప్రతిపక్షాలు ఈ ఆరోపణలు చేస్తున్నాయని ఆమె ద్వజమెత్తారు. తాను అన్నిటిపై చర్చలకు సిద్దమని,విపక్షాలు అందుకు అంగీకరించాలని అన్నారు. కాగా పార్లమెంటు ప్రతిష్టంబనపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అద్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది.అందులో కూడా సుష్మ రాజీనామాకు కాంగ్రెస్ పట్టుబట్టింది.