నేను తప్పు చేయలేదు

2

– సుష్మా సంజాయిషీ

న్యూఢిల్లీ, ఆగస్టు12(జనంసాక్షి):

లలిత్‌ మోదీ వ్యవహారంలో తాను ఏ తప్పూ చేయలేదని… అపరాధ భావమూ తనకు లేదని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎలాంటి కళంకితాలకు పాల్పడలేదన్నారు. లలిత్‌ మోదీ అంశంపై లోక్‌సభలో జరిగిన చర్చలో భాగంగా విపక్షాలు చేసిన విమర్శలకు ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన విధంగా తాను నేరస్థులను ఎవరినీ దేశం దాటించలేదని భోపాల్‌ గ్యాస్‌ కేసులో ఆండర్సన్‌ వ్యవహారాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన వ్వయహారాలను ప్రస్తావిస్తూ రాహుల్‌పై చురకలంటించారు. లలిత్మోడీ వ్యవహారంలో మొదటి నుంచీ సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నానని… విపక్షాలే తన మాట వినట్లేదన్నారు. సభలో ఆందోళన చేయాలి.. సభను అడ్డుకోవాలి అన్నదే లక్ష్యంగా విపక్షాల తీరు ఉందని మండిపడ్డారు. అనారోగ్యంతో ఉన్న మహిళకు సాయం చేయాలన్న ఉద్దేశమే తప్ప.. ఈ అంశంలో తనకు ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు. లలిత్‌మోదీకి ప్రయాణపత్రాలు ఇవ్వాలన్న అంశం తన పరిధిలోని కాదని సుష్మాస్వరాజ్‌ స్పష్టం చేశారు. లలిత్‌ మోదీకి ప్రయాణ పత్రాలు ఇవ్వడం వల్ల భారత్‌, బ్రిటీష్‌ సంబంధాలపై ప్రభావం పడుతుందా అని ప్రశ్నించారు. లలిత్‌మోదీ పాస్‌పోర్టు కేసు తన కుటుంబసభ్యులు వాదించారన్నది అవాస్తమని ఆమె పేర్కొన్నారు. తన భర్త ఈ కేసులో వాదించారన్నది రికార్డుల్లో ఎక్కడైనా చూపించగలరా? అని సవాల్‌ చేశారు. తన కుమార్తె న్యాయవాదుల బృందంలో 9వ నంబరు సభ్యురాలని స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఆమెకు ఎలా బాధ్యత ఉంటుందన్నారు. చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఆయన శ్రీమతి నళిని ఆదాయపు పన్నుశాఖ తరపున వకాల్తా ఫైల్‌ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ విషయాన్ని అన్నాడీఎంకే సభలో ప్రస్తావించినప్పుడు ఆ విషయం తన దృష్టికి రాలేదని చిదంబరం దాటవేశారని తెలిపారు. శారదా కుంభకోణంలో నిందితుల తరపున నళినీచిదంబరం వాదించారని.. కోటి రూపాయల ఫీజు కూడా తీసుకున్నారని తెలిపారు. శారదా కుంభకోణం ఆర్థికశాఖ పరిధిలో ఉన్నప్పుడు ఆర్థికమంత్రి భార్య ఎలా వాదించారన్న విషయం ఎవరికీ గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. తాను క్రిమినల్‌ చర్యలకు పాల్పడ్డారని రాహుల్‌గాంధీ విమర్శించారని.. ఎలాంటి క్రిమినల్‌ చర్యకు పాల్పడ్డానో ఆయన చెప్పగలరా అని సుష్మాస్వరాజ్‌ సవాల్‌ చేశారు. 15వేల మంది మరణానికి కారణమైన అండర్సన్‌ను దేశం దాటించింది కాంగ్రెస్‌ నాయకత్వంలోని ప్రభుత్వం కాదా?.. ఆయన్ని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ విమానంలో తీసుకురమ్మని అర్జున్‌సింగ్‌కు చెప్పింది రాజీవ్‌గాంధీ కాదా అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ అప్పుడప్పుడు సెలవు పెట్టి ఎక్కడికో వెళ్తుంటారని.. ఈ సారి సెలవు పెట్టినప్పుడు ఏకాంతంలో ఆయన కుటుంబ చరిత్ర చదువుకోవాలని ఎద్దేవా చేశారు. బ్రిటీష్‌ ప్రభుత్వం లలిత్‌మోడీకి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించుకుంటే ఎవరి పరిధిలోకి వస్తుందన్నారు. తన రాజకీయ జీవితంపై విమర్శలుచేసే అధికారం కాంగ్రెస్‌కు లేదన్నారు.