నేను మున్నాభాయిని కాదు
– ఎంబీబీఎస్ లక్ష్మారెడ్డినే
హైదరాబాద్,ఆగస్ట్8(జనంసాక్షి): టీడీపీ నేతలు గోబెల్స్ వారసులు అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. రాజకీయ శత్రువు లేని మంత్రి లక్ష్మారెడ్డిని కూడా రేవంత్‌రెడ్డి విమర్శించడం సరికాదన్నారు. రేవంత్ విచక్షణ కోల్పోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జైలుకెళ్లినా రేవంత్‌రెడ్డి తీరు మారలేదన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన విూడియాతో మాట్లాడుతూ ఎన్నోసార్లు టీడీపీ నేతలు అభాసుపాలయ్యారని గుర్తు చేశారు. చంద్రబాబు భజన చేస్తున్న రేవంత్‌ను చూడలేక ఆయన అనుచరులు పార్టీ మారుతున్నారని చెప్పారు. ఏపీ ప్రభుత్వానికి ఊడిగం చేస్తే రాజకీయ జీవితం అమరావతికే అంకితమవుతదన్నారు. ఇదిలావుంటే అసత్య వార్తలపైఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ఆధారాలు లేకుండా మాట్లాడిన వ్యాఖ్యలను ఓ పత్రిక ప్రచురించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆధారాలు లేకుండా కథనాలు ప్రచురించడం సబబు కాదన్నారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్ వ్యాఖ్యలపై మంత్రి ధ్వజమెత్తారు. తాను నిజంగా డాక్టర్‌ను అని స్పష్టం చేశారు. గుల్బార్గాలో ¬మియోపతి కోర్సు చదివానని తేల్చిచెప్పారు. కొడంగల్ నియోజకవర్గంలో టీడీపీ ఖాళీ అవుతుంటే తట్టుకోలేక రేవంత్‌రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని ఉద్ఘాటించారు. తన సర్టిఫికెట్లు బోగస్ అని తేలితే … రాజకీయాల నుంచి తప్పుకుంటానని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. తాను గుల్బర్గా ¬మియోపతి మెడికల్ కాలేజీలో విద్యనభ్యసించానని, అక్కడే నా సర్టిఫికెట్‌ను రిజిస్టర్ చేయించుకున్నానని ఆయన తెలిపారు. రాజకీయంగా ఎదుర్కోలేకే రేవంత్‌రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని, చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలను తాము వ్యక్తిగతంగా విమర్శించలేదని పేర్కొన్నారు.