నేరం నాది కాదు … కేబినెట్‌ది

అన్నీ తెలిసే జరిగాయి
నా రాజీనామాపై తుది నిర్ణయం సీఎందే : ధర్మాన
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి):
కళంకితులు.. నేరస్తులు అని వ్యాఖ్యా నించడం సమంజసం కాదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ సిబిఐ చేసినవన్నీ ఆరోపణలు మాత్రమే అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. వాటి పట్ల అవగాహన లేని వారే లేనిపోని వ్యాఖ్యలు చేస్తారని అన్నారు. ఆరోపణ లను కోర్టు నిర్ధారించాల్సి ఉందన్నారు. చట్టానికి అందరూ సమానమేనన్నారు. కేటాయింపులన్నీ మంత్రి మండలి నిర్ణయం మేరకే జరుగుతాయన్నారు. అంతేగాని స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఎవరికీ ఉండద న్నారు. ఒక వ్యక్తికి గాని, సంస్థకు గాని, ప్రజా ప్రయోజనానికి గాను రెవెన్యూ మంత్రిగా భూములు కేటాయించే అధికారం తనకు లేదన్నారు. తెలిసి గాని, తెలియక గాని ఏ ఒక్క తప్పు చేయలేదన్నారు. నిర్దోషిత్వాన్ని నిరూపించు కుంటానన్నారు. సిబిఐ వ్యక్తీకరించిన అంశాలపై ముఖ్యమంత్రి కిరణ్‌ వివరణ కోరానని, ఆయనకు అన్ని విషయాలు తెలియజేశానని అన్నారు. తాను ఇచ్చిన వివరణపై ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని తాను భావిస్తున్నానన్నారు. 45 రోజులుగా తన రాజీనామా పెండింగ్‌లో ఉందన్నారు. తన రాజీనామాపై తుది నిర్ణయం సిఎందేనని చెప్పారు. సిబిఐపై ఎలాంటి ఆరోపణలు చేయబోనన్నారు. వారి కోణాలు వారివి అని అన్నారు. పబ్లిక్‌ సర్వెంట్‌గా ఉన్నప్పుడు నోటీసు, వివరణ ప్రక్రియ సాధారణం అని చెప్పారు. తనకు ఇచ్చిన నోటీసులకు సంబంధించి సిఎంకు వివరణ ఇచ్చానన్నారు. తనకు అవసరమైన మద్దతు ప్రభుత్వం నుంచి వస్తుందని భావిస్తున్నానని చెప్పారు.