నేరమే అధికారమైతే?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన ఐదో చార్జిషీట్‌లో రాష్ట్ర హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరును చేర్జింది. సిమెంట్‌ కంపెనీలకు అక్రమంగా సున్నపురాయి నిక్షేపాలు, నీళ్ల కేటాయింపు కేసులో అప్పటి గనుల శాఖ మంత్రి సబితకు పాత్ర ఉందని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఆమెను ఏ4గా సీబీఐ పేర్కొంది. ఈ కేసులో పరిశ్రమల శాఖ మాజీ కార్యదర్శి శ్రీలక్ష్మిని ఆమె తర్వాతి స్థానంలో నిందితురాలిగా పేర్కొంది. ఇప్పటికే జగన్‌ కేసులో మోపిదేవి వెంకటరమణ అరెస్టు అయి చంచల్‌గూడ జైల్లో ఉండగా, మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరును సీబీఐ చార్జిషీట్‌లో చేర్చింది. ఒక మంత్రి జైలులో ఉండగా ఇద్దరు మంత్రులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. జగన్‌ అక్రమాస్తులు కూడగట్టేందుకు ఉపకరించవినగా చెప్పుకునే 26 జీవోలు జారీ చేసిన మంత్రులపైనా విచారణ జరపాలనే సుప్రీం కోర్టు ఆదేశంతో సీబీఐ ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేసింది. జగన్‌ అరెస్టుకు ముందే మోపిదేవిని అరెస్టు చేసిన సీబీఐ మరో ఐదుగురు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ పాత్రపై సీబీఐ దర్యాప్తు సాగిస్తోంది. వాన్‌పిక్‌ కేసులో దాఖలు చేసిన నాలుగో చార్జిషీట్‌లో ధర్మన ప్రసాదరావును ఏ5గా నమోదు చేసింది. ఇప్పుడు సిమెంట్‌ కంపెనీలకు సంబంధించిన వ్యవహారంలో ఐదో చార్జిషీట్‌ దాఖలు చేయగా, మరికొన్ని చార్జిషీట్లు త్వరలో దాఖలు చేయనున్నట్లు సీబీఐ కోర్టుకు నివేదించింది. అంటే 26 జీవోలు జారీ చేసిన వారిలో మిగతా మంత్రులు గీతారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య బోనెక్కక తప్పని పరిస్థితి. రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ఆరుగురు వివిధ కేసుల్లో విచారణ ఎదుర్కొంటుంటే పాలకపక్షానికి విశ్వసనీయత ఎలా ఉంటుంది. మంత్రివర్గ సమావేశంలో తీసుకునే సమష్టి నిర్ణయాల ఆధారంగానే జీవోలు విడుదలవుతాయి. ఆ జీవోలే అమల్లోకి వస్తాయి. జగన్‌పై విచారణ ప్రారంభమైన తొలినాళ్లలో ఈ మంత్రులే చిత్రవిచిత్రమైన ప్రకటనలు చేశారు. ఒక వ్యక్తి స్వార్థం కోసం అక్రమాలకు పాల్పడ్డాడంటూ ఆరోపణలు గుప్పించారు. జగన్‌ ఆస్తుల కేసుకూ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకున్నారు. దీనిపై ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో సీన్‌ మొత్తం మారిపోయింది. మంత్రులపై విచారణ ప్రారంభం కావడంతో పాటు ఒకరిని జైలు పాలు చేసింది. అప్పటి వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం మోపిదేవి అరెస్టుతో అలర్ట్‌ అయింది. ధర్మానపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేయగానే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆయన రాజీనామా కొన్ని నెలల పాటు సీఎం వద్ద పెండింగ్‌లో ఉంది. చివరికి మంత్రివర్గమంతా ఆయనకు బాసటగా నిలిచింది. వాన్‌పిక్‌ వ్యవహారంలో మంత్రుల తప్పేమి లేదని ధర్మానను వెనకేసుకు వచ్చింది. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి వంతు వచ్చింది. ఆమె బోనెక్కక తప్పని పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చార్జిషీట్‌లో తన పేరు నమోదు చేయడంతో ఆమె రాజీనామా చేస్తానని చెప్పినా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ వారించినట్లు తెలుస్తోంది. మొన్న ధర్మాన రాజీమానాను తిరస్కరించిన సీఎం.. ఇప్పుడు సబిత రాజీనామా చేస్తానన్న వద్దని వారిస్తున్నాడు. నేరమై అధికారమైతే.. పరిస్థితి ఇలాగే ఉంటుంది. కేసును దర్యాప్తు చేస్తున్న సంస్థ అక్రమాస్తులు కూడబెట్టేందుకు మంత్రులు జారీ చేసిన జీవోలు కూడా కారణమని పేర్కొన్నా వారిని నిర్దోషులుగా సర్కారు పేర్కొనడం ఎంతవరకు సమంజసం. నేరం చేతిలో అధికారం కేంద్రీకృతమై ఉంటే ఎంతటి తప్పులనైనా మాఫీ చేసుకుంటూ పోతారా అనే సందేహం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు వస్తేనే పదవుల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితుల్లో అభియోగాలు నమోదు చేసి, చార్జిషీటు దాఖలు చేసినా మంత్రులను నిర్దోషులని చెప్పడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. అంతకుముందు ప్రభుత్వంలో వీరంతా మంత్రులు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి కుమారుడు. అతడి ఉన్నతి కోసం మంత్రివర్గం మొత్తం మూకుమ్మడిగా బాసటగా నిలిచినట్టుగా సీబీఐ చార్జిషీటును బట్టి తెలుస్తోంది. కానీ సీబీఐ దర్యాప్తునే తప్పుబట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మంత్రులు చేసింది తప్పేకాదని, వారికి ప్రభుత్వం పక్షాన న్యాయ సహాయం సైతం అందిస్తామని గతంలో నిస్సిగ్గుగా ప్రకటించింది. ప్రజాధనాన్ని దోచుకున్న వారిని కాపాడేందుకు మళ్లీ ప్రజాధనాన్నే వెచ్చించి లాయర్లను నియమించి కోర్టులో వాదనలు వినిపిస్తోంది. అంటే నేరం.. అన్యాయం చేతిలో అధికారం ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి. వీరంతా కలిసి ప్రకృతిని, ప్రజాసంపదను దోచుకున్నారనేది సీబీఐ అభియోగం.. కానీ రాష్ట్ర ప్రభుత్వం కాదంటోంది.. ప్రకృతి సంపద దోపిడీ అయ్యింది నిజమేకాని అందులో మంత్రుల ప్రమేయం లేదంటోంది. మంత్రుల ప్రమేయం లేకుండానే, వారు జీవోలు జారీ చేయకుండానే ఆయా కంపెనీలకు ఎలా అనుచిత లబ్ధి కలిగిందో వివరణ ఇవ్వడానికి కనీసం సాహసించడం లేదు. అప్పటి ముఖ్యమంత్రి కోసమే వీళ్లు పనిచేశారనుకున్నా తర్వాతి కాలంలో ఎందుకు బయటపెట్టలేదు? ఆ పాపంలో వీరికి ఎలాంటి భాగస్వామ్యం లేనప్పుడు ఎందుకు విచారణకు వెనుకాడుతున్నారు? అనే ప్రశ్నలకు ఎవరి వద్ద సమాధానం లేదు. ఎంతసేపు అధికారాన్ని పూర్తిస్థాయిలో అనుభవించాలి, అందుకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఎంతవరకైనా తెగించి అధిగమించాలి.. ఇవే ప్రస్తుత సర్కారు ముందున్న వ్యూహాలు. అందుకోసం ఎంతటి నేరగాళ్లనైనా కౌగిలించుకుంటారు. వారిని గొప్ప దేశభక్తులుగా కీర్తిస్తారు. ప్రస్తుత పాలకులు చేస్తున్నది ఇదే. ఇలాంటి పాలకులు ఉంటే రాష్ట్రం ఎటువైపు పోతుంది? రేపటితరానికి ప్రకృతి సిద్ధంగా అందాల్సిన వనరులు అందకుండాపోతే దానికి బాధ్యులెవ్వరు. పాలకుల అండతో మైనింగ్‌, సిమెంట్‌, గ్రానైట్‌, బాక్సైట్‌ మాఫియా సాగిస్తున్న అరాచకాల కారణంగా భవిష్యత్‌ తరాలకు తలెత్తే విపరిణామాలకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? దీనికి ఎవరి వద్ద సమాధానం లేదు. అన్యాయపు పాలన సాగిస్తున్న సర్కారు వద్ద సమాధానం అంతకూ లేదు. నేరాన్ని అధికారంలో నిలిపిన ప్రజలే నేరస్తులు అన్నట్టుగా ప్రతి రాజకీయ పక్షమూ వ్యవహరిస్తున్నాయి. ఉద్యమ స్వభావం ఉన్న పార్టీలు మినహా, బూర్జువా తత్వమున్న అన్ని పార్టీలదీ అదే తీరు. ప్రస్తుత రాజకీయాల్లో నేరస్తుల నేరహస్తుల హవా కొనసాగుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం క్షేమకరం కాదు.