నేలతల్లిని నమ్ముకున్న యువరైతు ఆత్మహత్య

సారంగపూర్‌, న్యూస్‌లైన్‌: నేల తల్లిని నమ్ముకులన్న ఆ యువకుడు కౌలు రైతుగా ప్రస్థావాన్ని ప్రారంభించారు. తనకంటూ సొంత పొలం  ఉండాలని అహర్నిశలు శ్రమించి కొంత డబ్బు కూడబెట్టుకుని మరి కొంత అప్పు చేసి భూమి కొనుగోలు చేశారు. అయితే నమ్ముకున్న నేల తల్లి, సహకరించని ప్రకృతి అతడిని నట్టేట ముంచాయి. దిగుబడి లేక.. పెట్టుబడి కూడా రాక.. అప్పులు తీరే మార్గం కనిపించక.. అతడు బలవన్మరణం పొందాడు. సాయినగర్‌ తండాకు చెందిన రాథోడ్‌ రాజు(29) కొన్నేళ్లుగా భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. కాలం కలిసివచ్చి దిగుబడి సక్రమంగా వచ్చినా కౌలు భారం అధికమైంది. తనకే పొలం ఉంటే ఈ భారం తప్పించుకుని ఎంతోకొంత మిగుల్చుకుని ఎంతోకొంత మిగుల్చుకోవచ్చని భావించి అతడు అహర్నిశలు శ్రమించి కొంత డబ్బు కూడబెట్టాడు.

ఏడాది క్రితం బోరిగాం శివారులో రూ.4 లక్షల 80 వేలకు రెండెకరాల వ్యవసాయ భూవి కొనుగోలు చేశాడు. ఈ డబ్బును వాయిదా ప్రకారం వాయిదా చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో మూడు వాయిదాలో రూ.3.80 లక్షల చెల్లించాడు. చివరి వాయిదా రూ.లక్ష ఈ ఉగాది లోపు చెల్లించాల్సి ఉంది. ఈ భూమిలో పత్తి పంట సాగు చేశాడు. ఈ ఏడాది కాలం కలిసి రాక పత్తి దిగుబడి ఏ మాత్రం రాలేదు. పెట్టుబడి కూడా రాలేదు. దీంతో భూమి కొనుగోలు చేసిన అప్పు ఎలా తీర్చాలా అని మథన పడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తన ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్తికి తరలించగా, నాలుగేళ్ల వయసు గల కుమార్తె శ్లోక ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయి భార్యపిల్లలు విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లింగమూర్తి తెలిపారు.