నేషనల్‌ హెరాల్డ్‌ పునరుద్ధరణ

4

న్యూఢిల్లీ,జులై 10(జనంసాక్షి):ఎనిమిదేళ్ల తర్వాత ‘నేషనల్‌ హెరాల్డ్‌’ పత్రిక మళ్లీ వెలుగుచూడనుంది. నేషనల్‌ హెరాల్డ్‌తో పాటు, మరో రెండు వార్తా పత్రికలను కాంగ్రెస్‌ పార్టీ పునరుద్ధరించనుంది. ఈనెలలోనే దీనిపై పార్టీ ఒక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. వచ్చే వారంలో ఈ పబ్లికేషన్లకు చెందిన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు సమావేశమై ఎడిటర్‌ ఎవరనేది నిర్ణయించిన వెంటనే ప్రకటన వెలువడవచ్చని చెబుతున్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను 1938లో జవహర్‌లాల్‌ నెహ్రూ లక్నోలో స్థాపించారు. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్‌ పాలకులు ఈ పత్రికపై నిషేధం విధించారు. 1940, 1970లో స్వల్పకాలం పత్రిక మూతపడింది. కాగా, మళ్లీ పత్రికలు ఇన్నేళ్ల తర్వాత వెలుగుచూడనున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారి, అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) సీఎండీ మోతీలాల్‌ వోరా తెలిపారు. ‘మూడు పత్రికలు…నేషనల్‌ హెరాల్డ్‌, ఖ్వామి అవాజ్‌ (ఉర్దూ), నవజీవన్‌ (హిందీ)లను పునరుద్ధరించాలని మేమనుకుంటున్నాం. ఈ ఏడాది జనవరిలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం అమలు తుది దశలో ఉన్నాం. ఎడిటర్‌ పేరు ఫైనలైజ్‌ చేయడంతో పబ్లికేషన్లను బయటకు తీసుకువస్తాం. ఇందుకు సంబంధించి మరి కొద్దిరోజుల్లోనే లాంఛనంగా ఒక ప్రకటన విడుదల చేస్తాం’ అని మోతీలాల్‌ వోరా తెలిపారు. దేశంలోని పలు చోట్ల ఏజేఎల్‌ సొంత ఆస్తులు కలిగి ఉంది. వీటిలో న్యూఢిల్లీలోని హెరాల్డ్‌ హౌస్‌ కూడా ఉంది. చివరిసారిగా 2008లో ఈ మూడు పత్రికలు ఇక్కడి నుంచి పబ్లిష్‌ అయ్యాయి.