న్యాయం కావాలి
– రోడ్డెక్కిన తెలంగాణ జడ్జీలు
– మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం
– గవర్నర్ నరసింహన్‌తో స్పష్టీకరణ
హైదరాబాద్,జూన్ 26(జనంసాక్షి):తెలంగాణలో ఆంధ్రా జడ్జీల ఆప్షన్ ను వ్యతిరేకిస్తూ న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకు జడ్జీలు కూడా జతకలిశారు. తెలంగాణకు చెందిన న్యాయమూర్తులు తమ ఫెడరేషన్ అధ్యక్షుడికి మూకుమ్మడిగా రాజీనామా పత్రాలు అందజేశారు. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గరికి చేరుకొని అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించారు. అక్కడి నుంచి రాజ్ భవన్ కు ప్రదర్శనగా బయలుదేరారు. గవర్నర్ కు కూడా తమ రాజీనామా లేఖలను ఇవ్వాలని నిర్ణయించారు.గన్‌పార్క్ నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయలుదేరిన తెలంగాణ న్యాయాధికారులు గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతోందని వారు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అంతకుముందు ర్యాలీగా బయలుదేరిన న్యాయాధికారులను ఖైరతాబాద్ చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. న్యాయశాఖలో ప్రాథమిక కేటాయింపులపై నిరసన వ్యక్తం చేస్తూ న్యాయాధికారులు మూకుమ్మడి రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. రాజీనామా పత్రాలను గవర్నర్‌కు సమర్పించేందుకు గన్‌పార్క్ నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయలుదేరారు. ఖైరతాబాద్ వద్ద వారిని పోలీసులు అడ్డుకుని గవర్నర్‌ను కలిసేందుకు అనుమతి లేదని వివరించారు. అనంతరం వారి విజ్ఞప్తితో ఐదుగురు న్యాయాధికారుల ప్రతినిధి బృందానికి గవర్నర్‌ను కలిసేందుకు అనుమతి ఇచ్చారు