న్యూక్లియర్‌ సైట్‌ను ధ్వంసం చేయనున్న ఉత్తర కొరియా

– అంతర్జాతీయ జర్నలిస్టులకు ఆహ్వానం
ప్యోంగ్యాంగ్‌, మే22(జ‌నం సాక్షి) : అణుపరీక్షలు నిర్వహించిన ప్రాంతాన్ని ఉత్తర కొరియా ధ్వంసం చేయనున్నది. దీని కోసం అంతర్జాతీయ జర్నలిస్టులను కూడా ఆ దేశం ఆహ్వానించింది. అయితే దక్షిణ కొరియాకు చెందిన 8మంది జర్నలిస్టులకు మాత్రం ఆదేశం అనుమతి ఇవ్వలేదు. అమెరికాతో సంయుక్త సైనిక విన్యాసాల్లో దక్షిణ కొరియా పాల్గొనడం వల్ల ఉత్తర కొరియా ఆ నిర్ణయం తీసుకున్నది. అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్‌తో జూన్‌ 12వ తేదీన సింగపూర్‌లో కిమ్‌ కలవనున్నారు. ఈ నేపథ్యంలో నార్త్‌ కొరియా తమ దేశంలో ఉన్న న్యూక్లియర్‌ సైట్‌ను పూర్తిగా ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నది. అండర్‌గ్రౌండ్‌ పరీక్షలు, ఖండాంతర బాలిస్టిక్‌ మిస్సైళ్లను పరీక్షించిన సైట్‌ను ధ్వంసం చేయాలని కిమ్‌ ఆదేశించారు. నార్త్‌ కొరియాకు వచ్చిన జర్నలిస్టుల బృందంలో బ్రిటన్‌, రష్యా, చైనా, అమెరికా వ్యక్తులు ఉన్నారు. వాతావరణాన్ని బట్టి న్యూక్లియర్‌ సైట్‌ను పేల్చేయడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదే ప్రాంతంలో ఉత్తర కొరియా మొత్తం ఆరు అణపరీక్షలను నిర్వహించింది.