నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం
నల్లగొండ : నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెద్దవూర మండలం రామన్నగూడెం తండా వద్ద చాపర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు మహిళా ట్రైనీ పైలట్ మహిమ మృతి చెందారు. మహిమ తమిళనాడుకు చెందిన యువతిగా గుర్తించారు. మరో పైలట్ వివరాలు తెలియాల్సి ఉంది. పైలట్ల శరీర భాగాలు తునాతునకలుగా పడిపోయాయి. శరీర భాగాలు ముద్దలు ముద్దలుగా, గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రెవెన్యూ, వైద్య యంత్రాంగం కూడా ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. శిక్షణ హెలికాప్టర్ కూలిన విషయాన్ని ఎయిర్‌ఫోర్స్ అధికారులకు సమాచారం అందించారు.
భారీ శబ్దాలు.. దట్టమైన పొగలు
చాపర్ కూలిన సమయంలో భారీ శబ్దం వినిపించిందని స్థానిక రైతులు, కూలీలు పేర్కొన్నారు. దట్టమైన మంటలు, పొగలు వచ్చినట్లు తెలిపారు. హెలికాప్టర్ కూలిన వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు. నాగార్జున సాగర్ వైపు నుంచి హెలికాప్టర్ వచ్చినట్లు రైతులు పేర్కొన్నారు.
ఫ్లైటెక్ ఏవియేషన్‌కు చెందిన చాపర్
ప్రమాదానికి గురైన చాపర్‌ను మాచర్ల మండలం నాగార్జున సాగర్ విజయపురిసౌత్‌లో ఉన్న ఫ్లైటెక్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్‌గా పోలీసులు గుర్తించారు. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో అదుపుతప్పి చాపర్ కుప్పకూలినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.