పంచాక్షరితో మార్మోగిన యాగశాల
నాలుగోరోజూ వేదోక్తంగా పారాయణాలు
శ్రీ రాజశ్యామలాదేవికి సువర్ణమంత్ర పుష్పాంజలి
పాల్గొన్న కెసిఆర్ దంపతులు..నేడు పూర్ణాహుతితో ముగింపు
గజ్వెల్,జనవరి24(జనంసాక్షి): పంచాక్షరి జపంతో సిఎం కెసిఆర్‌కు చెందిన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని యాగశాల మార్మోగింది. దేశం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సహస్ర చండీయాగం నాలుగో రోజూ కొనసాగుతోంది. కార్యక్రమంలో యాగకర్త, రుత్విక్కులు, వేద పండితులు అరుణ వస్త్రాలతో పూజల్లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దంపతులు రాజశ్యామల మాత మండపంలో తొలి పూజ నిర్వహించారు. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపిణిగా శ్రీ రాజశ్యామలాదేవిని సువర్ణమంత్ర పుష్పాంజలితో ప్రార్థించారు. వేదోక్తంగా రుత్విక్కులు పూజలు చేశారు. రాజశ్యామల మండపంలో సీఎం దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం మహారుద్ర మండపంలో జరిగిన పూజల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మహారుద్ర సహిత రుద్రఏకాదశి పఠనం, రుద్రనమకం, రుద్రచమకం పఠించారు. బ్రహ్మస్వరూపిణి బగళాముఖి మండపంలో సీఎం దంపతుల సమక్షంలో వేదపండితులు, రుత్వికులు ప్రత్యేక పూజలు చేశారు. సీఎం దంపతులను వేదపండితులు దీవించారు. నవగ్రహ మండపంలో ఆదిత్య హృదయ పఠనం, సూర్యనమస్కారాలు నిర్వహించారు. చండీమాత ప్రధాన యాగశాలలో రాజరాజేశ్వరీ మాత ప్రార్థన చేశారు. రుత్వికులు 400సార్లు చండీ సప్తశతి పారాయణం పఠించారు. లోక కళ్యాణార్ధం ముఖ్యమంత్రి కేసీఆర్ చేయిస్తున్న సహస్ర చండీయాగం నాలుగోరోజూ శాస్తోక్తంగా కొనసాగింది. ఉదయం పూజానంతరం 300 చండీ పారాయణాలు పూర్తి చేశారు. ¬మంలో భాగంగా అరుణ పారాయణ మహాసారం, పంచ కాఠకముల పారాయణాలు, నవగ్రహ జపానుష్టానాలు, మహా మృత్యుంజయ జపం నిర్వహిస్తున్నారు. శుక్రవారం పూర్ణాహుతితో చండీయాగం పూర్తవుతుంది.యాగం వీక్షించేందుకు వచ్చిన భక్తులకు వేదపండితులు సుభాషితాలు, యాగ విశిష్ఠతను వివరించారు.


