‘పంచాయతీ’ ఏర్పాట్లు ముమ్మరం
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్: పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఎస్సీ, ఎస్సీ , బీసీ వర్గాల వారీగా ఓటరు జాబితాను విడుదల చేసిన అధికారులు ఇక పోలింగ్ కేంద్రాల కోసం కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో కొత్తగా 18 గ్రామాలు పంచాయతీలుగా ఏర్పడడం తో గ్రామ పంచాయతీల సంఖ్య 1207కు చేరింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే లోపు మరికొన్ని గ్రామాలు పంచాయతీలుగా అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాముంది. సిరిసిల్ల మండలం సారంపల్లి , దేశాయ్‌పల్లి , రామడుగు మండలం లక్ష్మీపూర్, వెంకట్రావుపల్లి పంచాయతీల పదవీకాలం జూన్ వరకు ఉంది. ఈ నాలుగు మినహా 1203 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ మేరకు పోలింగ్ కేంద్రాల జాబితాను ఏప్రిల్ ఒకటిన తయారు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అన్ని గ్రామ పంచాయతీల్లో రిటర్నింగ్ అధికారులు, పొలింగ్ సిబ్బంది నియామకం కోసం ఆర్డీవోలు, డెప్యూటీ ఎన్నికల అధికారి, ఎంపీడీవోలు, తహశీల్దార్లకు ఆదేశాలందాయి.
2న పొలింగ్ కేంద్రాల జాబితా ప్రచురణ, 3,4 తేదీల్లో కేంద్రాలపై అభ్యంతరాల స్వీకరణను పూర్తి చేసి 6న జిల్లా ఎన్నికల అధికారికి అందజేయాల్సి ఉంటుంది. అభ్యంతరాలపై విచారణ, సమస్యాత్మక గ్రామాల గుర్తింపు , పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై ముసాయిదాను సిద్ధం చేసి 8న తుది జాబితాను వెల్లడించనున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో 11,688 పొలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి వాటి సంఖ్య స్పల్పంగా పెరిగే అవకాశాముందని అధికారులు పేర్కొంటున్నారు.