పంచాయతీ లో అస్తవ్యస్తంగా మారిన రక్షిత తాగునీటి పథకం
చండ్రుగొండ జనంసాక్షి జూన్ 23 : చండ్రుగొండ పంచాయితీలో రక్షిత తాగునీటి పథకం అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి నల్లా ద్వారా తాగునీటిని సరఫరా చేసే లక్ష్యం నీరు గారిపోతోంది. పంచాయతీలోని కొన్ని వీధుల్లో నిరంతర నీటి సరఫరా కారణంగా పైపుల లీకేజీలు ఏర్పడి విధులు బురదమయంగా మారుతున్నాయి. మరికొన్ని వీధుల్లో అసలు నీటి సరఫరా లేకుండా పోయింది. 3రోజుల కొకసారి నీటి సరఫరా అవుతుండటంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే నీటి సరఫరాలో సరైన సమన్వయం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నీటి సరఫరాలో నిత్యం ఏదో సమస్య తలెత్తడం పంచాయతీ ఆనవాయితీగా మారింది. ప్రతి నిత్యం సమస్యలు సర్వసాధారణంగా మారడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎర్రటి ఎండలో చేతి బోర్ల వద్ద నుండి బిందెలతో నీళ్లు మోసుకునే దుస్థితి ఏర్పడింది. మరికొన్ని వీధుల్లో బోర్లు పని చేయక సుదూర ప్రాంతాల నుండి నీటిని మొసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఏది ఏమైనా చండ్రుగొండ పంచాయితీలో తరచూ ఏర్పడే నీటి ఎద్దడిపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.