పంజాబ్‌ ఎన్నికలో పాల్గొనున్న కేజ్రీవాల్‌

3
– నా ఇంటిపై సీబీఐ దాడుల చేస్తే మఫ్లర్‌లే దొరుకుతాయి

– ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

ఢిల్లీ,డిసెంబరు 27(జనంసాక్షి) :2017లో పంజాబ్‌లో జరుగనున్న సాధారణ ఎన్నికలకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ సన్నద్దమవుతున్నారు. ఈ మేరకు కేజ్రీవాల్‌ జనవరి లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ విషయమై ఇవాళ ఢిల్లీ లో కేజ్రీవాల్‌ విూడియా సమావేశంలో మాట్లాడుతూ జనవరి 14న పంజాబ్‌లోని ముక్తసరిలో భారీ స్థాయిలో బహిరంగ సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ 4ఎంపీ స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. కాగా తన ఇంట్లో సోదా చేస్తే సీబీఐ అధికారులకు మఫ్లర్లు మాత్రమే దొరకుతాయని ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. సీబీఐ అధికారులతో దాడులు చేయించిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహారం కంటితడుపు చర్యగా ఆయన పేర్కొన్నారు. ఈ నెల 15న ఢిల్లీలో సీఎం కార్యాలయంపై సీబీఐ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల రవాణశాఖలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ ముగ్గురు అధికారులను సస్పెండ్‌ చేసిన విషయంపై ఆయన ఆదివారం మాట్లాడారు. ఈ కేసులపై విచారించాల్సిందిగా సీబీఐ అధికారులకు ఢిల్లీ ప్రభుత్వం సూచిస్తుందని కేజ్రీవాల్‌ అన్నారు. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి ‘మప్లర్‌’ ధరించి వెళ్లిన కేజ్రీవాల్‌ ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిరోహించారు.