పంజాబ్‌ పఠాన్‌కోట్‌కు కథువా కేసు బదిలీ

సుప్రీం నిర్ణయాన్ని వ్యతిరేకించిన కాశ్మీర్‌ ప్రభుత్వం
న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి): కతువా రేప్‌ అండ్‌ మర్డర్‌ కేసును పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది. అయితే.. ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమని ఇదివరకే జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అప్పీల్‌ చేసింది. కేసు బదిలీని వ్యతిరేకించింది. కాని.. కతువా రేప్‌ కేసు బాధితురాలు తండ్రి అభ్యర్థన మేరకు కేసును కతువా నుంచి బదిలీ చేస్తున్నట్లు సుప్రీం తెలిపింది.
కతువా జిల్లాకు చెందిన ఎనిమిదేండ్ల అసిఫా జనవరి 10 న కనిపించకుండా పోయింది. వారం తర్వాత తన డెడ్‌బాడీ అదే ఏరియాలో దొరికింది. అయితే.. అసిఫాను కిడ్నాప్‌ చేసి ఓ గుడిలో దాచి డ్రగ్స్‌ ఇచ్చి మరీ తనపై అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితులపై కైమ్ర్‌ బ్రాంచ్‌ పోలీసులు చార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు.  అయితే.. ముందుగా అరెస్టయిన ఇద్దరు నిందితులు ఈ కేసును లోకల్‌ కోర్టులోనే విచారించాలని, ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని సుప్రీంకు విన్నవించారు. అయితే.. లోకల్‌ కోర్టులో నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున, సరైన విచారణ జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నందున ఈ కేసును పఠాన్‌కోట్‌కు బదిలీ చేస్తున్నట్లు తాజాగా సుప్రీం ప్రకటించింది.