పంటల నమోదు ప్రక్రియను పరిశీలించిన జిల్లా అధికారి అభిమన్యుడు
టేకులపల్లి, అక్టోబర్ 13( జనం సాక్షి): పంటలు నమోదు ప్రక్రియను జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు టేకులపల్లి మండలంలో గురువారం. పరిశీలించారు. బేతంపూడి రెవెన్యూ గ్రామంలో 20 మంది రైతుల పంటల పరిశీలన కొరకు డి ఏ ఓ యాప్ లో నమోదు చేసేందుకు సులానగర్, రాజు తండా, మద్రాస్ తండా, రావులపాడు, బేతంపూడి స్టేజి గ్రామాలకు చెందిన క్షేత్రాల్లో పంటల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రత్తి పంటలో అకాల వర్షాల వలన పారా విల్టు సోకే అవకాశం ఎక్కువగా ఉన్నందున పత్తి మొక్క మొదలు తడిసే విధంగా కార్బెండజం + మాన్కో జబ్ కలిసిన మందును 3 గ్రా/ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని ఆయన సూచించారు. ఒకసారి మల్టీకే (13-0-45) 5 గ్రాములు, ఫార్ములా-6 ను 5 గ్రా / కలిపి పిచికారి చేసుకోవాలని అన్నారు. గులాబీ రంగు పురుగు నివారణకు ధయోడికార్స్ 1.5 గ్రా/ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో టెక్నికల్ దీపక్ ఆనంద్, మండల వ్యవసాయ అధికారి నీరుడు అన్నపూర్ణ, ఏ ఈ ఓ లు విశాల, ప్రవీణ్, పాల్గొన్నారు.