పండ్ల తోటలకు ప్రోత్సాహం

ఆర్థికంగా రైతుల అభివృద్దికి కృషి

చిత్తూరు,నవంబర్‌25 (జనంసాక్షి) : సిఎం జగన్‌ రాష్టాన్న్రి వ్యవసాయకంగా అభివృద్ది చేసి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయనున్నారని మంత్రి నారాయణ స్వామి అన్నారు. రాయలసీమను పండ్ల తోటల హబ్‌గా మార్చాలని ముఖ్యమంత్రి విశేష కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వ్యవసాయాభివృద్ధికి చేస్తున్న నూతన విజ్ఞాన ఆవిష్కరణలు తెలుసుకొని ఎంపీఈవోలు క్షేత్రస్థాయిలో అమలు చేసి రైతులకు అండగా ఉండాలన్నారు. ఎంపీఈవోలు రైతులను కలిసి పంటల సాగు, ఉత్పత్తులు మార్కెటింగ్‌ వంటి వాటిపై తెలుసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఇక్కడ రైతులు పండించే పండ్లకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందన్నారు. పండ్ల తోటల పెంపకం పెద్దఎత్తున చేపట్టాలన్నారు. డ్రిప్‌ ద్వారా భూగర్భ జలాలు పొదుపుగా వాడుకొని పంటలు సాగు చేయాలన్నారు. పండ్ల తోటల సాగులో రాయలసీమ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. హెచ్చెల్సీ కింద ఉన్న భూములు సారవంతం కోల్పోయి నిస్సారంగా తయారవుతున్నాయనీ.. ఆయకట్టు భూముల్లో మళ్లీ మంచి పంటలు పండేలా కృషి చేయాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది వేరుసెనగ దిగుబడి బాగా వచ్చినా.. బహిరంగ మార్కెట్‌లో సరైన గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందిగా మారిందన్నారు. రైతులు ఉత్పత్తులను బయట తక్కువ ధరలకు విక్రయించవద్దనీ అన్నారు. వ్యవసాయం, పండ్ల తోటల పెంపకంలో ఆదర్శంగా నిలవాలన్నారు.