పచ్చదనానికి చిరునామా కావాలి

గ్రామాల్లో నిర్దేశిత లక్ష్యాలు నెరవేరాలి
సిరిసిల్ల,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     నెలరోజుల్లో పరిశుభ్రత, పచ్చదనానికి ప్లలెలు చిరునామాగా మారాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పిలుపునిచ్చారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు.  30 రోజుల కార్యాచరణలో భాగంగా చేపట్టాల్సిన పనులను వివరించారు. ప్లలెలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని వివరించారు. నెలరోజుల ప్రత్యేక కార్యాచారణ కార్యక్రమంలో గ్రామ రూపురేఖలు మారిపోయేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. గ్రామంలో పచ్చదనం.. పరిశుభ్రత నెలకొని ఉండేలా ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. సమష్టి భాగస్వామ్యం తీసుకుని ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు.
ప్రజలు శ్రమదానంతో పనులు చేసేలా ప్రోత్సహించాలని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లను తొలగించాలని, నిరుపయోగంగా ఉన్న బోర్లను, లోతట్టు ప్రాంతాల్లోని గుంతలను పూడ్చి వేయాలని వివరించారు. ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవడమేగాక తప్పక వినియోగించాలని తెలిపారు. డ్రైనేజీల్లో పేరుకున్న చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 జరిమాన విధించాలని ఆదేశించారు. మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. విద్యుత్‌ సమస్యలను, ప్రమాదకరంగా ఉన్న తీగలను, స్థంభాలను సరిచేయాలని, అవసరమయ్యే చోట కొత్త స్థంభాలను ఏర్పాటు చేయాలని సూచించారు.