పట్టణ సమస్యల పరిష్కారం కోరుతూ మునిసిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించిన సిపిఐ

మొద్దు నిద్రలో పాలకవర్గం
సిపిఐ నేతలు రవీంద్రనాధ్‌, అందె విమర్శ
మార్కాపురం ,జూలై 24,: త్రాగునీరు, రహదారులు, విద్యుత్‌, ముఖ్యంగా మహిళలకు మరుగుదొడ్లు, డ్రైనేజీ, నిరుపేదలకు పక్కా గృహాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న పట్టణ ప్రజలకు సాగర్‌జలాలను అందించాలని కోరుతూ తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో సోమవారం ఉదయం స్థానిక మునిసిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ నాయకులు రావులపల్లి రవీంద్రనాధ్‌ మాట్లాడుతూ మార్కాపురం పట్టణం మునిసిపాలిటీగా ఏర్పడి 47 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఏ మాత్రం అభివృద్దికి నోచుకోలేదని ఫలితంగా ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మునిసిపాలిటీలలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను అధ్యయనం చేసి ఆ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర సిపిఐ పిలుపు మేరకు అన్ని కేంద్రాలలో సమస్యలపై స్థానిక పార్టీ శాఖలు విస్తృతంగా తిరిగి గుర్తించడం జరిగిందని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమమే తమ సంక్షేమం అని పదేపదే వాగ్ధానాలు గుమ్మరించే పాలకవర్గం ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని విమర్శించారు. ప్రజల అవసరాలను గుర్తించడంలోను పరిష్కారం చేయడంలోను విఫలమైన పాలకవర్గం మరోవైపు పన్నుల రూపంలో అనేక విధాలుగా భారాలు మోపుతూ ప్రజలను తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. మునిసిపాలిటీ వ్యవస్థను నిర్వీర్యం చేసి బాధ్యతల నుండి రాష్ట్ర ప్రభుత్వం పక్కకు తొలుగుతున్నట్లుగా ఉందని రవీంద్రనాధ్‌ విమర్శించారు. సిపిఐ నాయకులు, మాజీ మునిసిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ అందె నాసరయ్య మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ గతంలో అనేక సందర్భాలలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని తీవ్రంగా విమర్శించారు. దూపాడు నుండి సాగర్‌ జలాలను పైప్‌లైన్ల ద్వారా పట్టణంలోని ప్రజలందరికీ అందించాలని అందుకు అనుగుణంగా నిర్మాణ పనుల కోసం తక్షణం టెండర్లను పిలవాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే పట్టణంలోని పూలసుబ్బయ్య కాలనీ, బాపూజీ కాలనీ, ఏకలవ్య కాలనీ, కొండారెడ్డి కాలనీ తదితర ప్రాంతాలలో కార్మికులు వ్యవసాయ కూలీలు ఎక్కువ సంఖ్యలో జీవనం కొనసాగిస్తున్నారని వీరందరూ మంచినీటికోసం దూరప్రాంతాలకు వెళ్లి మంచినీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దళితులు, లంబాడీలు నివసిస్తున్న ప్రాంతాలలో మంచినీటి బోర్లు కానీ, రహదారులు, విద్యుత్‌ తదితర సౌకర్యాలు ఏమాత్రం లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారని చాలా సందర్బాలలో విష పురుగుల బారిన పడి ప్రమాదాలకు లోనైన సందర్భాలు చాలా ఉన్నాయని నాసరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణ సిపిఐ నాయకులు ఎంసిహెచ్‌ అల్లూరయ్య మాట్లాడుతూ ఏ చిన్న సమస్య పరిష్కారం కావాలన్నా ఉద్యమాల ద్వారా పరిష్కారం కావాలే తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని, ఈ పాలకవర్గాలకు ప్రజా సమస్యలమీద ఎంతమాత్రం కూడా చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తమ పార్టీ చేపట్టిన పాదయాత్రలో ప్రజలు ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని లేనిచో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం పై సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మునిసిపల్‌ కమీషనర్‌ ఎం రవీంద్రారెడ్డికి అందచేశారు. అందుకు స్పందించిన కమీషనర్‌ మాట్లాడుతూ న్యాయసమ్మతమైన సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తామని పార్టీ నాయకులకు హామీ ఇచ్చారు. సిపిఐ నాయకులు కోరిన పట్టణంలోని సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ ముట్టడి కార్యక్రమంతో మునిసిపల్‌ కార్యాలయం అంతా ఆందోళన కారులతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో డివిజన్‌ రైతు సంఘం కార్యదర్శి డి రాజారెడ్డి, ఏరియా సిపిఐ నాయకులు సిహెచ్‌ రామిరెడ్డి, పార్టీ నాయకులు ఎం వెంకయ్య, గెలవయ్య, డి అల్లూరయ్య, వై ఆంజనేయులు, చేవూరి అంకయ్య, గుండాల కాశయ్య, ఎస్‌కె మౌలాలి, డి కరుణ, పెద్దారవీడు మండల కార్యదర్శి సట్టెబోయిన సుబ్బారావు, బి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుండి సిపిఐ ఆధ్వర్యంలో మునిసిపల్‌ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ప్రదర్శన జరిగింది.