పడిపోతున్న ధరతో బేజారవుతున్న పత్తిరైతు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 4 : దిగుతున్న పత్తిధరతో రైతులు బేజారవుతున్నారు. ఈ ఏడాది పెరిగిన విత్తనాలు, ఎరువుల ధరతో వ్యవసాయ పెట్టుబడులు పెరిగి రైతులు ఆందోళన చెందుతుండగా మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక సతమతమవుతున్నారు. జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో పత్తిసాగవుతోంది. ఈ ఖరీఫ్‌లో విపరీతంగా పెరిగిన పెట్టుబడుల కారణంగా పండించిన పంటలకు గిట్టుబాటు ధర వస్తుందన్న ఆశించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. జిల్లాలో 75 లక్షల క్వింటాళ్లకు పైగా పత్తి మార్కెట్‌కు వస్తుందని అధికారులు అంచనా వేసినప్పటికీ వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడులు తగ్గిపోయాయి. పత్తి క్వింటాల్‌కు ఆరువేల రూపాయలు ఆశించినప్పటికీ కనీసం ఐదు వేల రూపాయలు వస్తుందని ఆశించిన రైతులకు పత్తి కొనుగోలు ప్రారంభంలో క్వింటాల్‌కు 4300 రూపాయలు మాత్రమే రావడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో వారున్నారు. కనీసం ఆ ధరైనా ఉంటుందని అనుకున్నప్పటికీ రోజురోజుకు పత్తిధర తగ్గిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్తిధర క్వింటాల్‌ ప్రస్తుతం 3900 రూపాయలుగా ఉంది. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.