పత్తి కొనుగోళ్లకు రంగం సిద్దం

గిట్టుబాటు ధరలపైనే రైతుల్లో ఆందోళన

ఖమ్మం,అక్టోబర్‌26(జ‌నం సాక్షి): సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలుకు రంగం సిద్దంఅయ్యింది. పత్తి కొనుగోళ్లు చేయడానికి నాలుగు జిల్లాల్లో కూడా సన్నాహాలు మొదలు పెట్టారు. అయితే బహిరంగ మార్కెట్‌లోనే ధరలు ఎక్కువగా ఉండడంతో సిసిఐ కొనుగోళ్లకు అంతగా ఆదరణ ఉండకపోవచ్చని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే బహిరంగ మార్కెట్‌లలో ధర ఎక్కువగా లభిస్తోంది. ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.5వేల చొప్పున ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే ప్రైవేటు వ్యాపారులే ఎక్కువ ఇస్తున్నందువల్ల ప్రైవేటు వారికే ఎక్కువగా విక్రయించే అవకాశం ఉంది. ఈ నెల 17 నుంచి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో ప్రైవేటు వ్యాపారుల ద్వారా పత్తి కొనుగోళ్లను ప్రారంభించనున్నారు. ప్రతి సీజన్‌లోనూ రైతులను తేమ పేరుతో వ్యాపారులు నిండా ముంచుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీసీఐ పత్తి కొనుగోలు చేయడానికి తేమ 8శాతాన్ని మించకూడదు. అంత కంటే ఎక్కువ శాతం తేమ ఉంటే కొనుగోలు చేయబోమని సీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాలకు మించి తేమ శాతం ఎక్కువే ఉంటుంది. దీనిని పరిగణలోకి తీసుకుని కొత్త ఆదిలాబాద్‌ జిల్లాలో 12శాతం వరకు తేమ ఉన్నా ఎటువంటి కోతల్లేకుండా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. గతేడాదిలో రైతుల ఒత్తిడి మేరకు 17శాతం తేమ ఉన్నా కొనుగోలు చేశారు. మిగిలిన జిల్లాల్లో ఇంకా తేమ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఓ వైపు కొనుగోళ్లకు సిద్ధమవుతున్న తరుణంలో కూడా తేమపైన లెక్కతేలక పోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రైతులకు ఎక్కడైతే ఎక్కువ ధర లభిసుందో అక్కడే విక్రయించుకునేలా అవకాశం ఉంటుంది. జిల్లాలో పత్తి కొనుగోళ్లపైన ఇంకా సరైన స్పష్టత రాలేదు. గత సీజన్‌లో ఆరు చోట్ల సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.