పత్తి కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి

ఆదిలాబాద్‌, జనవరి 20 (): ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిసిఐ అధికారుల వ్యవహార శైలిపై పత్తి రైతులు గుర్రుగా ఉన్నారు. పత్తి కొనుగోళ్లు కేంద్రాలలో పత్తి నిల్వలు పెరుకుపోయాయనే కారణంతో కొనుగోళ్ళను నిలిపివేసిన అధికారులు తిరిగి ఎప్పటి నుంచి కొనుగోలు చేస్తారనే విషయంపై ప్రకటన చేయకపోవడంతో పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు రోజులుగా పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరుగాలాలు కష్టబడి పెట్టుబడులు పెట్టిన రైతులకు తమ పంటను అమ్ముకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. పత్తి కొనుగోళ్లు ప్రారంభం నుంచి సిసిఐ అధికారులు సాంకేతిక కారణాలు చూపుతూ తరచుగా కొనుగోళ్లు నిలిపివేయడంతో పత్తిని అమ్ముకోవడానికి ప్రైవేటు వ్యాపరస్తులను ఆశ్రయించి నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ. 3,900 ధర నిర్ణయించగా ప్రైవైట్‌ వ్యాపారస్తులు క్వింటాళ్లుకు ఆరు వందల రూపాయలు తగ్గించి, రూ. 3300 చెల్లిస్తున్నారు. కొనుగోళ్లను నిలిపివేయడంతో పత్తి రైతులు తమ అవసరాలకు పత్తిని ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకుంటే నష్టపోతున్నారు. ఇప్పటికే వ్యవసాయ పెట్టుబడులు పెరిగినప్పటికీ దానికి అనుగుణంగా పంటలకు గిట్టుబాటు ధర రాక చేసిన అప్పులు ఎలా తీర్చుకోవాలని రైతులు అయోమయంలో ఉన్నారు. సిసిఐ అధికారుల వ్యవహారశైలి రైతులకు అంతుపట్టడం లేదు. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కొనుగోళ్లు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.