పథకం ప్రకారమే చంద్రబాబు బస్సుపై దాడి

– రాజధాని చంద్రబాబు ఒక్కరికోసం కాదు

– ఐదు కోట్ల ప్రజల కోసం

– టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు

విజయవాడ, డిసెంబర్‌2(జ‌నంసాక్షి) : తెదేపా అధినేత చంద్రబాబు బస్సుపై పథకం ప్రకారమే దాడి చేశారని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈనెల 5వ తేదీన అమరావతి అంశంపై చంద్రబాబు అధ్యక్షతన జరిగే రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహణ ఏర్పాట్లపై తెదేపా ముఖ్యనేతలు విజయవాడలోని కేశినేని భవన్‌లో సోమవారం చర్చించారు. ఈ సమావేశానికి వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలను, మేధావులను, నిపుణులు, ప్రజాసంఘాలు, రాజధాని రైతులు, ప్రజలను పిలవాలని నిర్ణయించారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… రాజధానిపై ముఖ్యమంత్రి, మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. రాజధాని కోసం తెదేపా ప్రభుత్వం ఐదేళ్లు వృథా చేయలేదని స్పష్టం చేశారు. రెండున్నరేళ్ల ముందే రాజధానిని ప్రారంభించామని వివరించారు. రాజధాని అనేది చంద్రబాబు ఒక్కరి కోసం కాదని.. ఐదు కోట్ల ప్రజల కోసమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో రాజధాని అయితే ఏపీలోని అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటుందని భావించి చంద్రబాబు నాయుడు అమరావతిలో రాజధాని నిర్మాణం చేయడానికి నిర్ణయించారని అన్నారు. స్థానిక రైతులు స్వచ్ఛదంగా భూములు ఇచ్చేందుకు ముందుకు రావటంతో రాజధాని ప్రాంతంలో పలు భవనాలను పూర్తిచేయటం జరిగిందని, మరికొన్ని సగంలో ఉన్నాయని అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందని విమర్శించారు. వైకాపా కుట్రలను బహిర్గతం చేసేందుకు చంద్రబాబు రాజధాని పర్యటనకు వెళ్తే వైకాపా కార్యకర్తలతో రాళ్లు వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ప్రతీ ఒక్కరూ తీవ్ర ంగా ఖండించాలని అచ్చెన్నాయుడు కోరారు.