పథకాలు ప్రజలచెంతకు చేర్చండి

మెదక్‌, జూలై 17 : ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు దరి చేరే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎన్‌. దినకర్‌బాబు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సంగారెడ్డి డివిజన్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. అధికారులు ప్రభుత్వ పథకాలను బడుగు బలహీన వర్గాల పేద ప్రజల దరికి చేర్చాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టే ప్రతి పథకం ప్రజలకు చేరువయ్యేలా పని చేయాలని తెలిపారు. మండల తహసీల్దారులు మండలంలోని భూముల వివరాలు, భూముల కన్జర్వెన్సీ, భూ సంబంధ వివాదాలను తక్షణమే పరిష్కంచాలని కలెక్టర్‌ తెలిపారు. మండలంలోని ఇరిగేషన్‌ చెరువులు, కుంటల పరిస్థితిపై అంచనా వేసుకొని వాటికి ఏమైన గండ్లు పడ్డట్లు ఉంటే వాటిని వెంటనే మరమ్మత్తులు చేయించాలని, ఎల్లప్పుడు మండల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. రచ్చబండ-2లో వచ్చిన దరఖాస్తుల వివరాలను అప్‌లోడ్‌ చేయాలని, అర్హత లేని దరఖాస్తులను, గుర్తించిన వాటిని మరోసారి పరిశీలించాలని, తప్పిదాలు జరిగితే బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటానని తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డుల తనఖీ కార్యక్రమం ఈ నెల 31లోపు పూర్తి చేయాలన్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్‌ కార్డులో ఉన్న వారు, ఆ ఇంట్లో ఉన్నవారి వివరాలు సరి చూసుకోవాలని, ఏమైనా తప్పులుంటే వాటిని వెంటనే సరి చేయాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. అర్హత గల రైతులందరికీ రుణం అర్హత కార్డులు జారీ చేసి రైతులందరికీ బ్యాంకు రుణం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. ఈ నెల 20న సంగారెడ్డి డివిజన్‌కు సంబంధించి పాత జిల్లా గ్రామీణావృద్ధి సంస్థ కార్యాలయంలో (డి.ఆర్‌.డి.ఎ) వికలాంగుల కృత్రిమ అవయవాల కోసం శిబిరం నిర్వహించనున్నట్టు, వికలాంగులకు అందజేయనున్నట్టు చెప్పారు.