పది జిల్లాల తెలంగాణ ఇదే ప్రజల ఆకాంక: కేకే

హైదరాబాద్‌, జనవరి 6 (జనంసాక్షి) :
పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ప్రజల ఆకాంక్ష అని సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు కె. కేశవరావు అన్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ అధికారులు, ఉద్యోగుల డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆకాంక్షల మేరకు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం, ఏఐసీసీ అధినాయకత్వంపై ఒత్తిడి తీసుకువ స్తామన్నారు. తెలంగాణలోని సమస్త ప్రజలు హైదరాబాద్‌ సహా పది జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ అంశం కీలక దశకు చేరుకుం దని, యూపీఏ ప్రభుత్వానికి తెలంగాణ ఏర్పాటు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. ప్రజలు సంయమ నంతో వ్యవహరించాలని కోరారు. ఎవరూ ఉద్వేగానికి లోనుకావొద్దని ప్రత్యేక రాష్ట్రం వచ్చి తీరుతుందని తెలిపారు. అభివృద్ధి మండళ్లు, ప్యాకే జీలు, పొట్లాలు అంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చ రించారు. ప్రజల
మనోభావాలతో ఆడుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, అఖిలపక్షం పేరుతో కాలయాపన చేయాలనుకుంటే అది కాంగ్రెస్‌ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందన్నారు. ఇంకా కాంగ్రెస్‌ పార్టీ మోసం చేయాలని ప్రయత్నిస్తే ప్రజలు ఊరుకోబోరన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఇదివరకే అధిష్టానానికి తెలియజేశామన్నారు. స్థానింగా నెలకొన్న పరిస్థితులను పార్టీ పెద్దలకు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నామన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ మజ్లిస్‌ అడ్డుకున్నంత మాత్రాన తెలంగాణ ఆగదని తేల్చిచెప్పారు. కేంద్రం తెలంగాణ ఇవ్వాలనుకుంటే ఎందరు ఒక్కటై జట్లు కట్టినా ఏమీ కాదన్నారు. తెలంగాణలోని ప్రజలంతా ప్రత్యేక రాష్ట్రమే కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, ఈనెల 28లోపు మరో తెలంగాణ మార్చ్‌ నిర్వహిద్దామని సూచించారు. ప్రజాగాయకుడు గద్దర్‌ మాట్లాడుతూ 28లోగా తెలంగాణపై కేంద్రం తేలుస్తుందని నమ్మకం లేదని అన్నారు. రాజకీయ శక్తులన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్టులు కె. శ్రీనివాస్‌, టంకశాల అశోక్‌, టీయూఎఫ్‌ నాయకురాలు విమలక్క, ఉద్యోగులు, అధికారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.