పదో తరగతిలో ఉత్తమ ఫలితాలకు కృషి: డీఈవో

కడప,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ఉపాధ్యాయులు పాఠ్యంశాల బోధనతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి  అన్నారు. వచ్చే పదోతరగతి పరీక్షల్లో జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా చర్చించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో దాతల సాయంతో మౌలిక వసతులు కల్పించడానికి కృషిచేయాలని సూచించారు. ఉపాధ్యాయుడు ఎక్కడికి వెళ్లినా దాతలను పలుకరించి, వారి నుంచి సాయం పొందడానికి కృషిచేయాలని కోరారు. ఇదిలావుంటే పాఠశాలల్లో మరగుదొడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మరోవైపు  నగరపాలక ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఆంధప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య డిమాండ్‌ చేసింది. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఓబులరెడ్డి  మాట్లాడుతూ నగరపాలక పరిధిలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను రోస్టరు కమ్‌ మెరిట్‌ పద్ధతిలో పదోన్నతులు ఇవ్వాలన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఉద్యోగ, కార్మికులందరికీ భవిష్యనిధి ఖాతాలుంటే ఇక్కడ మాత్రమే లేకపోవడం దారుణమన్నారు. వెంటనే పీఎఫ్‌ ఖాతాలను తెరవాలని పట్టుబట్టారు. మున్సిపల్‌ ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్‌ లేకపోవడంవల్ల బదిలీలు, పదోన్నతుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. సర్వీసు రూల్స్‌ రూపొందించి శాసనమండలి సభ్యులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించి విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్యాలయం నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని కోరారు. పాఠశాలలన్నీంటికీ మౌలిక వసతులు కల్పించి పిల్లల చదువులకు ఆటంకంలేకుండా చూడాలని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయ పోస్టులకు గెజిటెడ్‌ ¬దా ఇవ్వాలన్నారు. విద్యాశాఖలో మున్సిపల్‌ విద్యను అనుసంధానం చేసి నిధులు, పోస్టులు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.