పధానిని కూడా లెక్‌పాళ్ పరిధిలోకి తేవాలి
ఢిల్లీ : ప్రధానమంత్రి కూడా ప్రజాసేవకుడని, ఆయనను లోక్‌పాళ్ పరిధిలోకి తీసుకురావడంలో తప్పేమీలేదని కర్ణాటక మాజీ లోకాయుక్త, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సంతోష్ హెగ్డే అన్నారు. ఇతర దేశాలలో ప్రధానమంత్రులపై అవినీతి కేసులు నమోదు అవుతాయని గుర్తుచేశారు. జపాన్‌లో ప్రతి సంవత్సరం ఒక ప్రధానమంత్రిని ప్రాసిక్యూట్ చేస్తున్నారని, అమెరికాలో మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సర్‌ను కూడా ప్రాసిక్యూట్ చేశారని తెలిపారు. మన ప్రధానమంత్రిలో గొప్పేమీలేదని అన్నారు. గతంలో బోఫోర్స్ కేసు, జేఎంఎం లంచాలకేసు విషయంలో భారత ప్రధానమంత్రుల మీద కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి కేవలం పదవీకారణంగా ప్రాసిక్యూషన్ నుంచి మినహాయించాలని రాజ్యాంగం చెబుతోంది. అయితే అదే సూత్రాన్ని జీవోలు జారీచేసే వ్యక్తికి ఎలా వర్తింపజేస్తాయని అన్నారు. అరవింద కేజ్రీవాల్ ప్రారంభించిన కొత్తపార్టీ ఆమ్ ఆద్మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందని ప్రశ్నించగా ఆ పార్టీ విజయావకాశాలపై తనకు సందేహాలు ఉన్నాయని చెప్పారు.కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 546 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపడమంటే అంత సులభమైన పనికాదని, చాలా నిధులు అవసరమవుతాయని అన్నారు. న్యాయవ్యవస్థలో అవినీతిని బయటపెడతానన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు వస్తున్నమాట నిజమేనని చెప్పారు. జస్టిస్ దినకరన్, జస్టిస్ సౌమిత్రసేన్, జస్టిస్ యాదవ్ వంటి వారిపై వచ్చిన ఆరోపణలను హెగ్డే ఉటంకించారు. న్యాయవ్యవస్థలో అవినీతిపై కేజ్రీవాల్ వద్ద కొన్ని ఆధారాలు ఉండొచ్చని అన్నారు. న్యాయవ్యవస్థను కూడా లోక్‌పాల్ పరిధిలోకి తేవాలని అభిప్రాయపడ్డారు.