పనికిరాకుండా ఉన్న పైలెట్‌ ప్రాజెక్ట్‌

కడప,నవంబర్‌ 21 చెన్నూరు మండలానికి విద్యుత్తు అందించడానికి రెండున్నర కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు ఆర్నెళ్ల క్రితం పూర్తయినా ఎందుకూ కొరగాకుండా పడివుంది. దీంతో ప్రజలు చెన్నూరు సబ్‌స్టేషన్‌పై పెట్టుకున్న ఆశలు నీరు గారిపోయాయి. పైలట్‌ ప్రాజెక్టు పనికిరాకుండా పోతుందని సిబ్బంది చెబుతున్నారు. పైలట్‌ ప్రాజెక్టు ప్రజలకు అందక పోవడానికి పవర్‌కట్టే సమస్యగా మారిందని ట్రాన్స్‌కో ఏఈ ఉపేంద్ర కుమార్‌ తెలిపారు. జిల్లాలో చెన్నూరు మండలాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రెండేళ్ల క్రితం రూ.3 కోట్లు- మంజూరు చేశారు.  ఈ పథకం ప్రారంభంలో అధికారులు కూడా ప్రజలకు అతి త్వరలో మెరుగైన విద్యుత్‌ అందిస్తామన్నారు దీంతో ఇక కరెంటు- కష్టాలు ఉండవంటూ ఆర్భాటంగా ప్రకటించారు. పనులు చేపట్టినప్పుడు మండలంలోని అన్ని గ్రామాలకు కొత్తగా 60 కిలోవిూటర్ల మేర విద్యుత్‌ లైన్లు వేశారు. అలాగే 3 వేల కొత్త విద్యుత్‌ స్తంభాలు వేయడంతో పాటు- సబ్‌ స్టేషన్‌ల వద్ద పలు రకాల స్విచ్‌లు, ఇతర పరికరాలు ఏర్పాటు- చేశారు. మొత్తం విూద పనులన్నీ బాగానే జరిగినా ప్రజలకు మేలైన విద్యుత్‌ మాత్రం అందలేదు. ఈలోగా పవర్‌ కట్‌ ఉంటుంది. ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియడం లేదు.