పరిపాలనపై పట్టులేకనే..
చంద్రబాబు కేంద్రాన్ని దూషిస్తున్నారు
– రాష్ట్రంలో ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారు
– విద్యుత్ కొనుగోళ్లతో ఏపీపై రూ.20వేలకోట్ల భారం పడుతుంది
– చంద్రబాబు పాలనపై హైకోర్టులో పిటీషన్ వేస్తా
– బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
రాజమండ్రి, ఆగస్టు8(జనం సాక్షి) : పరిపాలనపై పట్టులేక సీఎం చంద్రబాబు తన అనుచారగణాన్ని రెచ్చగొట్టి కేంద్రాన్ని దూషించే పని చేపట్టారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. గురువారం ఆయన విూడియాతో మాట్లాడుతూ బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై రెచ్చగొట్టే చర్యలు మానుకోకపోతే చంద్రబాబును ప్రజా ద్రోహిగా నిలబెడుతామని హెచ్చరించారు. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకాలు కారణంగా రాష్ట్రానికి రూ. 20 వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్న సోము వీర్రాజు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాధనం దోపిడీకి, దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. త్వరలో చంద్రబాబు పాలనపై హైకోర్టులో పిటిషన్ వేస్తామని సోము వీర్రాజు వెల్లడించారు. స్వచ్ఛ భారత్ ప్రకటనల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోలు లేకుండా కేవలం చంద్రబాబు, లోకేష్ ఫొటోలే పెడుతున్నారని సోమువీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో అవినీతిపై తెలుగుదేశం పార్టీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికధరలకు విద్యుత్ కొనుగోలుతో రాష్ట్రంపై రూ. 20వేల కోట్ల భారం పడుతుందని ఆయన అన్నారు. ఈ విషయంలో విద్యుత్ కొనుగోళ్లపై కోర్టుకెళ్తామని ఆయన అన్నారు.
—————————