పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం* – లింగం రామకృష్ణ, హెల్త్ అసిస్టెంట్

మునగాల, జూన్ 22(జనంసాక్షి): జాతీయ  కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేపాల ఆధ్వర్యంలో నర్సింహులగూడెం గ్రామంనందు దోమల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కలిసి పనిచేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరు దోమల వ్యాప్తిని అరికట్టాలని పిలుపునిచ్చారు. హెల్త్ అసిస్టెంట్ లింగం రామకృష్ణ మాట్లాడుతూ, వానకాలం వచ్చి వర్షాలు కురుస్తున్న కారణంగా సీజనల్ గా వచ్చే అంటు వ్యాధులు మరియు మలేరియా డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా(బోదకాలు) మెదడువాపు, అతిసార, డయేరియా వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 53 రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని తెలిపారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని, దోమల నివారణకు ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. మురికి నీటి గుంటల్లో కిరోసిన్ గాని, వాడిన ఇంజన్ ఆయిల్ ని వారానికి ఒకసారి వేసుకోవాలని, ఇంటి పరిసరాలలో పగిలిన పాత్రలు, బకెట్లు, ప్లాస్టిక్ కప్పులు, తాగి పడేసిన కొబ్బరిబొండాలు, టైర్లు లేకుండా చూసుకోవాలని తెలిపారు. కూలర్లు, పూలకుండీలో నీరు ఎప్పటికప్పుడు మార్చుకోవాలని, మరుగుదొడ్డి గాలి గొట్టాలకు జాలీలు కట్టుకోవాలని, దోమతెరలు వాడుకోవాలని, మంచినీటి  పైపుల లీకేజీలను గుర్తించి సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామ పెద్దలు, నాయకులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో దోమల వ్యాప్తిని అరికట్టి  ప్రజలను వ్యాధుల నుండి కాపాడాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు. వార్డు మెంబర్లు వారివారి వార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  కొప్పు ప్రమీల, ఎంపీటీసీ మదార్ బీ, కార్యదర్శి కృష్ణ, ఆశా వర్కర్లు సుధారాణి, లక్ష్మి, మాణిక్యమ్మ, గ్రామ పంచాయతీ సిబ్బంది నరసయ్య తదితరులు పాల్గొన్నారు.